పింఛన్ బెంగతో ఆగిన గుండెలు
ఆరుగురు మృతి.. హైదరాబాద్‌లో వికలాంగుడు
సాక్షి నెట్వర్క్: పింఛన్ రాదని, రాలేదనే బెం గతో వృద్ధుల గుండెలు ఆగుతున్నాయి. వేర్వేరు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఆరుగురు మృతి చెందారు. వరంగల్ జిల్లా వెంకటాపురానికి చెందిన భూస చంద్రయ్య(60) పేరు పింఛన్ల జాబితాలో లేదు. దీంతో ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన దీటి గంగవ్వ(75), పింఛన్ రావడం లేదని గుండెపోటుతో మృతి చెందింది.
హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట మండలం బతుకమ్మకుంటకు చెందిన కొండ అమురేష్(25)కు కాళ్లు, చేతులు సరిగా లేవు. పింఛన్ వచ్చిందని చెబుతున్న అధికారులు ఏ కేంద్రానికి వెళ్లాలో మాత్రం చెప్పడం లేదు. అన్ని కేంద్రాలు తిరిగిన ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపం చెంది మృతి చెందాడు. హయత్‌నగర్ డివిజన్ పరిధికి సాహెబ్‌నగర్‌కు చెందిన శశిరేఖ అనే వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయింది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన యశోద(70) పేరు పించన్ జాబితాలో ఉన్నా పంపిణీ చేయడంలో జాప్యం జరగడంతో నీరసించి కేంద్రం వద్ద పడిపోయింది. ఆస్పత్రికి తరలించగా చనిపోయింది. కొడంగల్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్అలీ పింఛన్ జాబితాలో పేరు లేదనే బెంగతో గుండెపోటుకు గురై చనిపోయాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన నల్లగుట్టు లచ్చమ్మ(80) పింఛన్ జాబితాలో పేరు గల్లంతు కావడంతో తుట్టుకోలేక సొమ్మసిల్లింది. మంచినీళ్లు తాగించే ప్రయత్నం చేసేలోపే చనిపోయింది.
వృద్ధుడికి వితంతు పింఛన్: ఆసరా పథకంలో వింతలు బయటపడుతున్నాయి. మలక్‌పేట సింగరేణి కాలనీకి చెందిన విశ్వనాథం పేరు వితంతు పింఛన్లో నమోదు చేశారు.