భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : పట్టణ శివారులోని గిరిప్రసాద్‌నగర్ కాలనీ లో ఓ ఇంటిపై పోలీసులు దాడిచేసి భారీగా డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమాదేవి తెలిపారు. ఆమె కథనం ప్రకారం... పట్టణ శివారు గిరిప్రసాద్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్‌పాషా ఇంట్లో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది.
పక్కా సమాచారం మేరకు డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో రూరల్ సీఐ వాసాల సతీష్, రూరల్ ఎస్సై రాజ్యలక్ష్మి సిబ్బందితో వెళ్లి ఆ ఇంటిపై దాడిచేశారు. ఇంట్లో తనిఖీ చేయగా 3,263 అల్యూమినియం ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 200 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 520 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, డేంజరస్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్లు 3 బాక్సులు(150), 44 వైర్ బండిళ్లు(578 మీటర్లు), 476 జిలెటిన్ స్టిక్స్, 145 పెద్ద డిటోనేటర్లు, అల్యూమినియం నైట్రేట్ 40 కేజీలు లభించాయి. దీంతో తహసీల్దార్ నూతి భాగ్యమ్మ ఆర్ఐ తిరుపతి సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ. అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచడం, ఉపయోగించడం చట్టరీత్యా నేరమన్నారు. మందుగుండు సామగ్రి ద్వారా ఇంట్లో ఉన్నవారికేగాక ఆ కాలనీవాసులకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందన్నారు. ఆ సామగ్రి మూలంగా ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.