హంద్రీ-నీవా పూర్తిచేస్తా
సీఎం అయిన వారం రోజుల్లో తంబళ్లపల్లెకు రోడ్లు
ప్రతి గుండె చప్పుడులో వైఎస్
జగన్ ప్రసంగానికి భారీ స్పందన
సాక్షి, తిరుపతి: రైతు కష్టం తెలుసని తాను ముఖ్యమంత్రి కాగానే హంద్రీ-నీవా పథకాన్ని త్వరగా పూర్తిచేస్తామని వైఎస్.జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం తంబళ్లపల్లెలో మూడో విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా బి.కొత్తకోట, అంగళ్లు కేంద్రాలలో ఆయన బహిరంగ సభల్లో ప్రసంగించారు. నీటి కోసం వేయి అడుగులకు పైగా బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ తనను కలుసుకున్న తంబళ్లపల్లె రైతులు ఆవేదన వెలిబుచ్చారన్నారు.
ఇటువంటి కష్టం రైతులు పడకుండా ఉండేందుకు హంద్రీ-నీవా పథకాన్ని త్వరలోనే పూర్తి చేస్తానని అన్నారు. తాను ముఖ్యమంత్రినైన వారంరోజుల్లో తంబళ్లపల్లెకు రోడ్లు వేయిస్తానని చెప్పారు. పక్కనే పీలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గంలో రోడ్లు వేయించలేక పోయారని అవి ఎంత అధ్వానంగా ఉన్నాయో తనకు తెలుసునని పక్కన ఉన్న నియోజకవర్గానికే ఏమీ చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమి చేయగలరని ప్రశ్నిం చారు. ఈ హామీలకు ప్రజలు భారీగా స్పందించారు.
‘‘జై జగన్’’ అంటూ నినాదాలు చేశారు.జననేత ప్రసంగంలో ప్రతి మాటకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వైఎస్ మరణించి ఎక్కడో లేడని, తమ గుండెల్లో ఉన్నాడని ప్రజలు అంటున్నారని, ఆయన ప్రతి గుండె చప్పుడులో ఉన్నాడని పేర్కొ న్నారు. వైఎస్ పేరు చెప్పగానే ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు. ‘ఒక్క మాటంటూ ఇస్తే మడమ తిప్పకూడదు, ఎన్నాళ్లు బతికామనేది ముఖ్యం కాదు ఎలా బతికామనేది ముఖ్యం’ అని తన తండ్రి చెప్పిన మాటలు చెవుల్లో రింగు రింగుమంటున్నాయని అనడంతో ప్రజలు చేతులు ఎత్తి స్పందన తెలిపారు.
విభజన జరిగితే ఉద్యోగాల కోసం ఎక్కడకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్‌ను, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడును కాలరు పట్టుకుని అడగాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేయడానికి మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొడితే, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సముద్రపు నీరే తప్ప తాగు నీళ్లు ఎక్కడున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చేయడమే రాజకీయమని అన్నారు. సీట్ల కోసం ఓట్ల కోసం చేసేది రాజకీయం కాదన్నారు.
చంద్రబాబునాయుడికి రెండు ప్రశ్నలు వేయదల్చుకున్నానని, ఆయన నోటి నుంచి సమైక్యం అన్న మాట ఎందుకు రాదని అన్నారు. రాష్ట్రాన్ని విడదీయమని చెబుతున్న నీకు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటమని అన్నారు. తెలుగుజాతిని విడగొట్టాలా? నీటి కోసం తన్నుకు చావాలా అని ఆయన ప్రశ్నించగా ప్రజలు పెద్ద ఎత్తున ‘‘వద్దు’’ అంటూ సమాధానం చెప్పారు.
ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా ఇంగ్లీషులో ‘నో’ అని సమాధానం చెప్పాలని జగన్ కోరినపుడు, వేలాది మంది చేతులెత్తి నో అని అరిచారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, అమరనాథ రెడ్డి, సమన్వయకర్తలు షమీమ్ అస్లాం, సునీల్‌కుమార్, రాజంపేట, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్ రెడ్డి, వరప్రసాదరావు, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, పార్టీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ శివభరత రెడ్డి, ప్రోగామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, యువజన కన్వీనర్ ఉదయకుమార్ పాల్గొన్నారు.