అంజనీ పుత్రా.. పవనసుత నామ
జంగారెడ్డిగూడెం రూరల్: కార్తీక మంగళవారం కావడంతో జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు వేదాంతం వెంకటాచార్యులు తమలపాకులతో ప్రత్యేక పూజలు, భక్తులు అందజేసిన 108 బంగారు తమలపాకులతో స్వామిని అర్చించారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉసిరిచెట్ల కింద మహిళలు దీపారాధన చేశారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.
మంత్రి సుజాత పూజలు
మద్దిక్షేత్రాన్ని మహిళా శిశు సంక్షేమ, గనులశాఖ మంత్రి పీతల సుజాత సందర్శించారు.చైర్మన్ ఇందుకూరి రంగరాజు, ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు ఆమెకు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలో దీపారాధన చేసి మంత్రి కార్తీక మాసోత్సవాలు ప్రారంభించారు. చిన్నారులకు పాలు పంపిణీ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని, అన్నసమారాధనను ప్రారంభించారు. ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ సభ్యుడు శీలం రామచంద్రరావు, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు ఆమె వెంట ఉన్నారు.
ఆదాయం రూ.3.34 లక్షలు
ఆలయానికి మంగళవారం ఒక్కరోజు రూ.3,34,666 ఆదాయం లభించినట్టు ఈవో పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పూజా టికెట్ల రూపంలో రూ.60,040, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,37,550, స్వామి ఫొటోల విక్రయం ద్వారా రూ.26,200, అన్నదాన విరాళాల రూపంలో రూ.1,10,876 ఆదాయం లభించిందన్నారు.