కాణిపాకం ఆలయంలో లఘు దర్శనం
కాణిపాకం (ఐరాల) : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శనివారం లఘు దర్శనం నిర్వహించారు. శని, ఆది, సోమ వారాలు వరుసగా ప్రభుత్వ సెలవు రోజులు కావడంతో దూరప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తులందరికీ శీఘ్ర దర్శనం కల్పించడం కోసం ఆలయ అధికారులు లఘు దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం అభిషేకాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. అభిషేక సేవలోనూ లఘు దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలోని పది, యాభై, వంద రూపాయల టికెట్ల క్యూలన్నీ భక్తులతో నిండాయి. రెండు నుంచి మూడు గంటల సమయం పాటు స్వామివారి దర్శనం కోసం భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. క్యూలోని భక్తుల దాహం తీర్చడం కోసం ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. క్యూలను ఆలయ ఏఈవో కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర, ఆలయ ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున పర్యవేక్షించారు.