అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం
రాజమండ్రి కార్పొరేషన్, న్యూస్‌లైన్ :రాజమండ్రి కోరుకొండ రోడ్డులోని వీరభద్ర హైట్స్ అపార్ట్మెంట్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ఐదోఫ్లోర్లోని ఫ్లాట్‌లో ప్రకాష్‌నగర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మీసాల తారకేశ్వరరావు ఉంటున్నారు. ఆయన ఆరు నెలల క్రితం విశాఖపట్నం నుంచి ఇక్కడకు వచ్చారు. బుధవారం ఉదయం ఆయన కార్యాలయానికి వెళ్లిపోయారు. ఇంట్లో భార్య విజయ, చిన్న కుమారుడు ఉన్నారు. దీపావళికి తీసుకువచ్చిన బాణసంచాలో కాకరపువ్వొత్తును చిన్న కుమారుడు వెలిగించాడు. దీంతో బాణసంచా సామగ్రికి మంటలు వ్యాపించాయి. విజయ భయంతో బయటకు వచ్చేశారు.
ఆరునెలల క్రితమే.
ఆరు నెలల క్రితమే తారకేశ్వరరావు ఆ ప్లాట్‌లో దిగారు. ఒక గదిలో ఆఫీసుకు సంబంధించిన కంప్యూటర్లు, ఏసీ, ఇతర విలువైన వస్తువులు, ఫైళ్లు భద్రపరిచారు. మంటలు వ్యాపించడంతో ఆ గదిలోని వస్తువులు బూడిదయ్యాయి. హాల్లోని సోఫా సెట్లు, బెడ్ రూమ్‌లోని మంచం, పరుపు మొత్తం కాలిపోయాయి. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపుచేశారు. మిగిలిన సామగ్రి అగ్నిపాలు కాకుండా కాపాడగ లిగారు. అయితే అపార్ట్మెంట్ నిర్మాణ సమయంలో నిబంధనలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. అగ్నిమాపకశకటం లోపలకు వెళ్లడానికి దారి లేదన్నారు.
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదు
అగ్నిమాపకశాఖ అధికారి శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరభద్ర హైట్స్‌కు అగ్నిమాపకశాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదన్నారు. నిబంధనలకు పట్టించుకో కుండా ప్లాన్ అప్రూవల్ చేశారన్నారు. దీనిపై సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ ఘటనలో సుమారు రూ.మూడులక్షలు ఆస్తినష్టం వాటిల్లిందన్నారు.