పంట నష్టం అంచనాకు వారమే గడువు
=దెబ్బతిన్న వరిని కలెక్టర్‌కు చూపిన పేర్ని నాని
=మళ్లీ అల్పపీడన ద్రోణి
=రైతుల గుండెల్లో గుబులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్, లెహర్ తుపానుల ధాటికి జరిగిన పంట నష్టం అంచనాలను వారంలోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయాధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పంట నష్టం నివేదికలను స్పష్టంగా తయారుచేయాలని చెప్పారు.
రైతుల పేర్లు, పంట నష్టం శాతంలో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పొలాన్ని పరిశీలించి వాస్తవంగా జరిగిన నష్టాన్ని వీఆర్వో, వ్యవసాయ విస్తరణాధికారి, గ్రామ సర్పంచి, రైతుమిత్ర గ్రూపు కన్వీనరు, ఆదర్శరైతు, పంచాయతీ కార్యదర్శి, నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు పరిశీలించాలన్నారు.
వీరందరితో గ్రామ కమిటీని ఏర్పాటుచేసి గ్రామంలో సాగు విస్తీర్ణం, పంట నష్టం జరిగిన విధానం తదితరాలను తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. తహశీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయాధికారులు మండలస్థాయి కమిటీగా ఏర్పడి నష్టం అంచనా విధానాన్ని పర్యవేక్షించాలన్నారు. గ్రామ కమిటీలు తయారుచేసిన నివేదికలను ఏరోజుకారోజు కంప్యూటరీకరించి తనకు అందజేయాలని కలెక్టర్ సూచిం చారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, ఉద్యానవనశాఖ ఏడీ సుబానీ, ఆయా మండలాలకు చెందిన వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
రైతులకు న్యాయం చేయండి..
తుపానుల ప్రభావంతో నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని కలెక్టర్‌ను కోరారు. బందరు మండలంలోని కానూరు, సీతారామపురం, తుమ్మలచెరువు, గుండుపాలెం, సుల్తానగరం తదితర గ్రామాలకు చెందిన రైతులను తీసుకుని ఆయన సోమవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిశారు. ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న వరిపైరును కలెక్టర్‌కు చూపించారు.
వ్యవసాయాధికారులు పంట నష్టం అంచనా వేసే సమయంలో నేలవాలిన పైరు ఉంటేనే నష్టం జరిగినట్లు నమోదు చేస్తామని చెబుతున్నారని, పంట నేలవాలకున్నా గింజలు గట్టిపడని పొలాలను పంట నష్టం జరిగినట్లు అంచనా వేసి రైతులకు తగు న్యాయం చేయాలన్నారు. అలాగే నష్టపరిహారంతోపాటు పంట బీమా ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నాని కలెక్టర్‌ను కోరారు. రైతులు తెచ్చిన దెబ్బతిన్న వరిపైరును పరిశీలించిన రఘునందన్‌రావు వెంటనే వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్‌తో ఫోన్లో మాట్లాడారు.
రైతులు పేర్కొన్న ప్రాంతాల్లో గింజలు గట్టిపడకుంటే పంట నష్ట పరిహారం కింద నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్ఎన్ గొల్లపాలెం సర్పంచి మట్టా వెంకటనాంచారయ్య, సీతారామపురానికి చెందిన రైతు బెజవాడ కోటేశ్వరరావు, గుండుపాలేనికి చెందిన నిమ్మగడ్డ వాసు, కానూరుకు చెందిన గణపాబత్తుల శివశంకర్, తుమ్మలచెరువుకు చెందిన తలారి శ్రీనివాసరావు, ఇంకా పలువురు రైతులు ఉన్నారు.
పలుచోట్ల వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం ఆకాశం మేఘావృతమై ఉంది. లెహర్ తుపాను అనంతరం మళ్లీ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందనే భయంతో రైతులు వరికోతలను ముమ్మరం చేశారు. ఈ పరిస్థితుల్లో మొవ్వ, కూచిపూడి, పామర్రు తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న పొలాలు, వరిపనలపై ఉన్న పైరు తడవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. వాతావరణశాఖ కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా వర్షాలు పడతాయని హెచ్చరించడంతో రైతులు భయపడిపోతున్నారు. మంగళవారం నాటికి మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే రైతులకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని వారు బెంబేలెత్తిపోతున్నారు.