ఆకాశమార్గాన మేడారానికి...
నేటి నుంచి హెలికాప్టర్ ట్రిప్పుల బుకింగ్
సాక్షి, హైదరాబాద్: మేడారం ఉత్సవాన్ని గగనతల యాత్రతో జరుపుకోవాలనుకునే వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. హెలి టూరిజం జాయ్ రైడ్స్ లో భాగంగా దీన్ని సిద్ధం చేసింది. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం రాత్రి కంపెనీ ప్రతినిధులతో చర్చించి గగన విహార ధరలను ఖరారు చేసింది. శుక్రవారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖతోపాటు ఆ ఏవియేషన్ సంస్థ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఈ నెల 15 నుంచి 18 వరకు మేడారం సందర్శనకు అవకాశముంది. పురాతన జలాశయమైన లక్నవరంను ఆకాశం నుంచి వీక్షించేందుకూ ఓ ప్యాకేజీ పెట్టింది. బేగంపేట విమానాశ్రయంతోపాటు నెక్లెస్‌రోడ్డులో హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజి మైదానం, లక్నవరం ఒడ్డున, మేడారం చేరువలో కూడా వాటిని సిద్ధం చేస్తున్నారు.
సిటీ ట్రిప్ 21 తర్వాత...
హైదరాబాద్ నగరాన్ని గగనతలం నుంచి వీక్షించే ప్యాకేజీలు ఈనెల 21 తర్వాత అందుబాటులోకి రానున్నాయి. దీని ధర రూ.4 వేలుగా ఉండనుంది. ప్యాకేజీ ధరలను త్వరలో ప్రకటించనున్నారు.
మేడారానికి ప్యాకేజీ ధరలు
* లక్నవరం చెరువును గగనతలం నుంచి వీక్షిం చేందుకు ఒక్కొక్కరికి రూ.3,330. ఒక్కో పర్యటన 8-10 నిమిషాలు. కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి.
* లక్నవరం నుంచి మేడారం దేవాలయానికి ఒక్కొక్కరికి రూ.5,400. కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి.
* వరంగల్ నుంచి మేడారం వరకు ఆరుగురు ప్రయాణికుల ప్యాకేజీ టూర్(రానూపోనూ) ధర రూ.92,500 (సర్వీసుటాక్స్ అదనం)
* బేగంపేట నుంచి మేడారం... ఆరుగురు ప్రయాణికుల ప్యాకేజీ టూరు (రానూపోనూ కలిపి)... ధర రూ. 2,75,000 (సర్వీసు టాక్స్ అదనం)