Helicopter services
-
మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16న ప్రారంభమైన జాతర 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హనుమకొండ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. చార్జీలు ఇలా.. హన్మకొండ నుంచి మేడారం షటిల్ సర్వీస్ ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999 జాతరలో 7,8 నిమిషాల ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700 బుకింగ్ ఇలా.. హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జాయ్ రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సేవలు బుధవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. హెలికాప్టర్ చార్టర్ సర్వీస్ అయితే కరీంనగర్ నుంచి మేడారానికి రూ. 75,000గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి మేడారానికి రూ. 75,000, మహబూబ్‌నగర్ నుంచి మేడారానికి రూ. 1,00,000 టికెట్ ధరను నిర్ణయించారు. ఇందులో 5 సీట్లు ఉంటాయి. వీఐపీ దర్శనం కల్పిస్తారు. విశేష స్పందన డారంలో హెలీకాప్టర్ రైడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. హెలికాప్టర్ ఎక్కి సమ్మక్క సారలమ్మ వార్ల గద్దెలు జంపన్న వాగు గుట్టలు పై నుంచి మేడారం అందాలు చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.. 2014 నుంచి వరంగల్ మామునూరు బేగంపేట విమానాశ్రయాల నుంచి మేడారానికి భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మేడారంలో భక్తులను ఎక్కించుకొని తిప్పి చూపించే స్థాయికి హేలీ సర్వీసులు చేరుకున్నాయి. -
శ్రీరామనవమికి హెలికాప్టర్ సర్వీసులు!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి దివ్యక్షేత్రానికి జాతీయ స్థాయిలో మంచి ప్రఖ్యాతి ఉంది. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి, మరుసటి రోజు జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం, దానికి ముందురోజు నిర్వహించే తెప్పోత్సవం కార్యక్రమాలకు సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. శ్రీరామనవవిుకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. గోదావరిపై వంతెన లేని కాలంలో కూడా భారీగానే వచ్చేవారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు గోటి తలంబ్రాలతో వందల కిలోమీటర్ల మేర కాలినడకన వస్తున్నారు. అయితే సీతారామ కల్యాణానికి ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారు సైతం ప్రతి సంవత్సరం వస్తుంటారు. భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం వరకు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది. కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అయితే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి మరింత ప్రాచుర్యం, ప్రాధాన్యత కల్పించేలా హైదరాబాద్, విజయవాడ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల సంఖ్య పెరిగే అవకాశం.. పర్యాటక శాఖ ద్వారా మూడు రోజుల పాటు హెలికాప్టర్లు నడిపితే ప్రముఖ వ్యక్తులు కల్యాణానికి వచ్చేందుకు మరింత ఆసక్తి చూపిస్తారని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు హైదరాబాద్ నుంచి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సర్వీసులు నడిపారు. విదేశీయులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినవారు, తెలంగాణ భక్తులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. గత శివరాత్రి పర్వదినం సందర్భంగా సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి సైతం హైదరాబాద్ నుంచి మూడు రోజుల పాటు హెలికాప్టర్ సర్వీసులు నడిపారు. ఈ రెండు చోట్లా జౌత్సాహిక భక్తుల కోసం విహంగ వీక్షణం అవకాశాన్ని సైతం పర్యాటక శాఖ కల్పించింది. శ్రీరామనవమి, తెల్లవారి పట్టాభిషేకం సందర్భంగా భద్రాచలానికి కూడా హైదరాబాద్, విజయవాడ నుంచి హెలికాప్టర్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, విహంగ వీక్షణం అవకాశాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. తద్వారా పర్యాటక శాఖకు ఆదాయం సమకూరడంతో పాటు భద్రాద్రికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఈ ప్రాంత వాసులు అంటున్నారు. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల ఆలయానికి సైతం హెలికాప్టర్ సర్వీసులు ఏర్పాటు చేస్తే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన భక్తులు సందర్శిస్తారని చెబుతున్నారు. భద్రాచలం, పర్ణశాల ఆలయాలు రెండూ గోదావరి ఒడ్డునే ఉన్నాయి. ఇప్పటికే భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను ఖండాంతరాలు దాటి అనేక దేశాలకు భక్తులు నిష్టతో తీసుకెళుతున్నారు. ఇలాంటి ప్రాశస్త్యం ఉన్న భద్రాచలం ఉత్సవాలకు హెలికాప్టర్ సర్వీసులను ఏర్పాటు చేయాలని, ఈ విషయమై మంత్రి అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి చొరవ తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
‘రాజన్న’ భక్తులకు హెలికాఫ్టర్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్ : శివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లడానికి హెలికాప్టర్ సదుపాయాన్ని కల్పించింది. హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళ్లి తిరిగి రావడానికి టికెట్ ధర రూ.30వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ సూచన మేరకే వేములవాడకు హెలికాఫ్టర్ సదుపాయాన్ని కల్పించామన్నారు. రూ.100 కోట్లు పెట్టి వేములవాడలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఒక్క టూరిజం ప్రాంతాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. -
హైదరాబాద్ టు మేడారం హెలికాప్టర్
సనత్‌నగర్: తెలంగాణ కుంభమేళా మేడారం జాతర నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మేడారానికి గగన మార్గాన చేరుకునేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే ప్రత్యేక రైళ్లు, బస్సులను ప్రారంభించగా.. తాజాగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బేగంపేట పాత ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్–మేడారం హెలికాప్టర్ సేవలను టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం జాతర అని పేర్కొన్నారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు వస్తుంటారని, గత ప్రభుత్వాలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వదిలేశాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకృతి సౌందర్యాలకు నెలవైన మేడారంలో అవసరమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. మేడారం జాతర ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధకరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూ.కోట్ల వ్యయంతో అక్కడ విడిది సౌకర్యం, రోడ్ల నిర్మాణం వంటి అన్ని రకాల వసతులు కల్పించారని పేర్కొన్నారు. ఏవియేషన్ శాఖ సహకారంతో టూరిజం శాఖ హెలికాప్టర్ సేవలను ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్, పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభం హన్మకొండ: ములుగు జిల్లా మేడారంలో జరగనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 51 ప్రత్యేక బస్ స్టేషన్ల నుంచి ఆదివారం బస్సులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 34 ప్రత్యేక బస్ స్టేషన్లు, అలాగే రాష్ట్రంలోని మిగతా 16 ప్రత్యేక బస్ స్టేషన్లతో పాటు మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ప్రత్యేక బస్సులు మేడారానికి నడిపిస్తున్నారు. మేడారం ప్యాకేజీలు ఇవే.. బేగంపేట పాత విమానాశ్రయం నుంచి మేడారానికి, తిరిగి మేడారం నుంచి బేగంపేట విమానాశ్రయానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ప్యాకేజీలో భాగంగా ఆరుగురు ప్రయాణి కులకు రూ.1,80,000 ప్లస్ జీఎస్టీని (అప్ అండ్ డౌన్) నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా రానుపోను హెలికాప్టర్ చార్జీ లు, హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక వాహన సౌకర్యంతోపాటు వీఐపీ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మేడారంలో జాతర వ్యూ చూసేం దుకు ప్రతి ప్రయాణికుడికి రూ.2,999 చార్జీ వసూలు చేస్తారు. హెలికాప్టర్ సేవల కోసం 9400399999ను సంప్రదించవచ్చు. -
ముంబై–పుణె మధ్య హెలికాప్టర్ సేవలు
ముంబై: యాప్‌తో నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకున్నట్టే... త్వరలో హెలికాప్టర్ సర్వీస్‌ను ఇంతే సులభంగా ఆర్డర్ చేసే అవకాశం రానుంది. దేశంలో తొలిసారిగా రెండు నగరాల మధ్య హెలికాప్టర్ సేవలు ఆరంభం కానున్నాయి. అమెరికాలో అతిపెద్ద హెలికాప్టర్ సేవల సంస్థ అయిన ‘ఫ్లై బ్లేడ్’ ఇందుకు శ్రీకారం చుట్టింది. ఢిల్లీకి చెందిన హంచ్ వెంచర్స్ భాగస్వామ్యంతో కలసి ఈ సంస్థ ముంబై–పుణె నగరాల మధ్య హెలికాప్టర్ సర్వీసులను వచ్చే మార్చి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ఏడాది మే వరకు ఎయిర్‌ఏషియాకు చీఫ్‌గా వ్యవహరించిన అమర్ అబ్రాల్ బ్లేడ్ ఇండియా సీఈవోగా పనిచేయనున్నారు. ఈక్విటీ పెట్టుబడుల సేవల్లో హంచ్ వెంచర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికాకు వెలుపల ఫ్లై బ్లేడ్ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్న తొలి దేశం భారత్ కావడం గమనార్హం. భారత మార్కెట్‌పై భారీ అంచనాలు ముంబైలోని జుహు, మహాలక్ష్మి ప్రాంతాల నుంచి హెలికాప్టర్ సర్వీసులు టేకాఫ్ తీసుకుంటాయి. తొలుత పుణె నగరంతో ఆరంభించి తర్వాత షిర్డీకి కూడా విస్తరించాలనుకుంటోంది ఫ్లైబ్లేడ్. తదుపరి ఆధ్యాత్మిక కేంద్రాలకు కూడా ఈ సేవలను విస్తరించే ఆలోచనతో ఉంది. వారాంతపు పర్యాటక సర్వీసులు కూడా సంస్థ ప్రణాళికల్లో ఉన్నాయి. బ్లేడ్ సీఈవో రాబ్ వీసెంతల్ మాట్లాడుతూ... ‘‘వాణిజ్య విమానాశ్రయాల్లో రద్దీ నుంచి హెలికాప్టర్ సేవలు ప్రయాణికులకు వెసులుబాటు కల్పిస్తాయి. 35 నిమిషాల ప్రయాణానికి 4–8 గంటల పాటు సమయం వెచ్చించాల్సిన అవస్థ తప్పుతుంది. అయితే, ఈ సేవలు ఓలా, ఊబర్ మాదిరిగా చౌకగా ఉండవు. డబ్బులు కంటే తమ సమయం విలువైన వారికి మా సేవలు తగినవి’’ అని వీసెంతల్ వివరించారు. -
వనజాతరకు ఆకాశయానం
నాలుగేళ్ల తర్వాత మళ్లీ హెలికాప్టర్ సర్వీసు సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల సౌకర్యార్థం హెలికాప్టర్ సర్వీసులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టర్బో ఏవియేషన్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.ఉమేశ్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ జి.కిషన్‌తో భేటీ అయ్యారు. మహాజాతర జరిగే ఫిబ్రవరి 12నుంచి 15వరకు హెలికాప్టర్ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమేశ్ చెప్పారు. మేడారంలో దేవతల గద్దెల సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ముందుగా సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుందని.. ఇందుకు 9908765554, 9676999683 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. చార్జీల వివరాలు ళీ హైదరాబాద్ నుంచి మేడారానికి 1.15గంటల ప్రయాణం. ఒక్కరికి రానుపోను చార్జి రూ.40వేలు ళీ వరంగల్ నుంచి రూ.18 వేలు ళీ ములుగు నుంచి రూ.8వేలు ళీ హెలికాప్టర్ అద్దెకు కావాలంటే ఐదుసీట్లకు రూ.90వేలు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సర్వీసు ఉంటుంది. అప్పట్లో రూ.6వేలు చార్జీ.. 2010లో వరంగల్‌లోని మామునూరు నుంచి ఒక్కో వ్యక్తికి రానుపోను రూ.6వేలు తీసుకున్నారు.