Helipyad
-
హోటల్ కాదు ‘ఫ్లోటల్’
వింతగా కనిపిస్తున్న ఈ నిర్మాణం ఏంటా అనుకుంటున్నారా.. ఇదో హోటల్. సముద్ర ఉపరితలంపై ఎంచక్కా తేలియాడుతూ.. పర్యాటక ప్రియులకు ఓ అందమైన అనుభూతిని పంచనుంది. దీన్ని ‘మార్ప్ హోటల్’ అని పిలుస్తారు. మధ్యలో హోటల్ ఉండి.. రెండు వైపులా బోట్లు ఉంటాయి. కస్టమర్లను ఒడ్డు నుంచి ఈ హోటల్‌కు తీసుకొచ్చేందుకు ఈ బోట్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అంతేకాదు హెలికాప్టర్ ఆగేందుకు ఓ హెలీప్యాడ్, స్విమ్మింగ్ పూల్ వంటి సకల సదుపాయాలు ఈ హోటల్ సొంతం. అయితే ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్‌లో ఈ హోటల్ మన కళ్ల ముందుకు రానుంది. లండన్‌కు చెందిన గియాన్లుకా సాంటోసుసో ఈ డిజైన్‌ను రూపొందించారు. దీన్ని మనోడు ముద్దుగా ‘ఫ్లోటల్’ అని పిలుచుకుంటున్నాడు. -
హెలికాప్టర్లో వెళ్లి.. బుర్జ్ దుబాయ్‌పై పెళ్లి..
దుబాయ్: ప్రపంచంలోనే అతి ఎత్తై భవనం బుర్జ్ దుబాయ్‌లో పెళ్లి చేసుకునే అవకాశం వస్తే..? అదీ ఆకాశంలో అంతెత్తున వేలాడుతున్నట్లుగా ఉండే.. హెలీప్యాడ్‌పై ఆ ముచ్చట తీర్చుకోగలిగితే..? భలేగా ఉంటుంది కదూ.. బుర్జ్ దుబాయ్ హోటల్ నిర్వాహకులు ఈ అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్నారు. భూమి నుంచి 212 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హెలిప్యాడ్‌పై పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వారే చేస్తారు. పైగా మీ విడిది నుంచి ‘అగస్టా 109’ హెలికాప్టర్లోగానీ, అత్యంత ఖరీదైన రోల్స్‌రాయిస్ ఫాంటమ్ కారులోగానీ హోటల్ వద్దకు వెళ్లొచ్చు.. హోటల్లోని ఖరీదైన సూట్లో బస చేయొచ్చు. అక్కడి ప్రఖ్యాత వంటగాళ్లతో మనకిష్టమైన వంటకాలు చేయించుకునీ తినొచ్చు.. అసలు మొత్తంగా పెళ్లంటే ఇదేరా..! అనేట్లుగా వైభవోపేతంగా వేడుకలు జరుపుకోవచ్చు. దీనంతటికీ జస్ట్.. 35 లక్షల రూపాయలు చెల్లిస్తే చాలు. అయితే, పెళ్లికొడుకు, పెళ్లికూతురు కోరుకునే డెకరేషన్, ఇతర సౌకర్యాల ఆధారంగా చెల్లించాల్సిన రుసుమును నిర్ణయిస్తారట. -
గరీబోళ్ల స్వర్గం...
పైన హెలీప్యాడ్.. మొత్తం 45 అంతస్తులు.. భారీ బాల్కనీలు.. ఇక్కడ్నించి చూస్తే.. దూరంగా అవీలా పర్వతాల సుందర దృశ్యాలు.. సీన్ అదిరింది కదూ.. వెనిజువెలాలోని కరాకస్‌లో ఈ టవర్ ఆఫ్ డేవిడ్ ఆకాశహర్మ్యం ఉంది. ఇంత బాగుందంటే.. ఇక్కడ ఉండేవాళ్లంతా గొప్పోళ్లే అని అనుకునేరు. ఈ బిల్డింగ్‌లో ఉండేవాళ్లంతా గరీబోళ్లు!! నిజం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తై మురికివాడ. వాస్తవానికి దీన్ని కట్టడానికి నిర్ణయించినప్పుడు.. దీన్నో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలని డెవలపర్, ఫైనాన్షియర్ డేవిడ్ బ్రిలెంబర్గ్ నిర్ణయించారు. అయితే, తర్వాతి దశలో ఆర్థిక సంక్షోభం రావడం, డేవిడ్ అర్ధాంతరంగా చనిపోవడంతో దీన్ని పట్టించుకునేవారు లేకపోయారు. దీంతో 1994 తర్వాత మురికివాడల్లోని వారు నెమ్మదిగా దీన్ని అక్రమించుకోవడం మొదలుపెట్టారు. అప్పటి హ్యూగో చావెజ్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలా మొత్తం భవనం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందులో 3 వేల మంది ఉంటున్నారు. డేవిడ్ చనిపోయేనాటికి మొత్తం 45 అంతస్తుల్లో.. 27వ అంతస్తుల పని పూర్తిగా అయిపోయింది. మిగతావి అరకొరగా మిగిలిపోయాయి. దీంతో 27 అంతస్తు పైనున్న వాళ్లంతా వారే సొంతంగా తలుపులు వంటివి బిగించేసుకుని.. ఎవరికి వారు ఆ స్థలాన్ని తమదిగా ప్రకటించేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా టవర్ ఆఫ్ డేవిడ్‌ను దొంగలు, దోపిడీదారుల రాజ్యంగా పేర్కొంటే.. ఇక్కడున్నోళ్లు మాత్రం నగరంలో నేరగాళ్లతో కూడిన మురికివాడలతో పోలిస్తే.. ఇది ఎంతో బెటర్ అని అంటున్నారు. అదీగాక.. కొన్ని నెలల క్రితమే ఇక్కడున్న నేరగాళ్లను బయటకు పంపించేశామని చెబుతున్నారు. నెలవారీ అద్దెలు వీరికెలాగూ లేవు. అయితే, భవనం భద్రత వ్యవహారాలు చూసేందుకు మాత్రం ఒక్కో కుటుంబం నెలకు రూ.2 వేలు చెల్లిస్తోంది.