గరీబోళ్ల స్వర్గం... | Garibolla heaven ... | Sakshi
Sakshi News home page

గరీబోళ్ల స్వర్గం...

Published Tue, Apr 15 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

గరీబోళ్ల స్వర్గం...

గరీబోళ్ల స్వర్గం...

పైన హెలీప్యాడ్.. మొత్తం 45 అంతస్తులు.. భారీ బాల్కనీలు.. ఇక్కడ్నించి చూస్తే.. దూరంగా అవీలా పర్వతాల సుందర దృశ్యాలు.. సీన్ అదిరింది కదూ.. వెనిజువెలాలోని కరాకస్‌లో ఈ టవర్ ఆఫ్ డేవిడ్ ఆకాశహర్మ్యం ఉంది. ఇంత బాగుందంటే.. ఇక్కడ ఉండేవాళ్లంతా గొప్పోళ్లే అని అనుకునేరు. ఈ బిల్డింగ్‌లో ఉండేవాళ్లంతా గరీబోళ్లు!! నిజం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తై మురికివాడ. వాస్తవానికి దీన్ని కట్టడానికి నిర్ణయించినప్పుడు.. దీన్నో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలని డెవలపర్, ఫైనాన్షియర్ డేవిడ్ బ్రిలెంబర్గ్ నిర్ణయించారు. అయితే, తర్వాతి దశలో ఆర్థిక సంక్షోభం రావడం, డేవిడ్ అర్ధాంతరంగా చనిపోవడంతో దీన్ని పట్టించుకునేవారు లేకపోయారు. దీంతో 1994 తర్వాత మురికివాడల్లోని వారు నెమ్మదిగా దీన్ని అక్రమించుకోవడం మొదలుపెట్టారు. అప్పటి హ్యూగో చావెజ్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

అలా మొత్తం భవనం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందులో 3 వేల మంది ఉంటున్నారు. డేవిడ్ చనిపోయేనాటికి మొత్తం 45 అంతస్తుల్లో.. 27వ అంతస్తుల పని పూర్తిగా అయిపోయింది. మిగతావి అరకొరగా మిగిలిపోయాయి. దీంతో 27 అంతస్తు పైనున్న వాళ్లంతా వారే సొంతంగా తలుపులు వంటివి బిగించేసుకుని.. ఎవరికి వారు ఆ స్థలాన్ని తమదిగా ప్రకటించేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా టవర్ ఆఫ్ డేవిడ్‌ను దొంగలు, దోపిడీదారుల రాజ్యంగా పేర్కొంటే.. ఇక్కడున్నోళ్లు మాత్రం నగరంలో నేరగాళ్లతో కూడిన మురికివాడలతో పోలిస్తే.. ఇది ఎంతో బెటర్ అని అంటున్నారు. అదీగాక.. కొన్ని నెలల క్రితమే ఇక్కడున్న   నేరగాళ్లను బయటకు పంపించేశామని చెబుతున్నారు. నెలవారీ అద్దెలు వీరికెలాగూ లేవు. అయితే, భవనం భద్రత వ్యవహారాలు చూసేందుకు మాత్రం ఒక్కో కుటుంబం నెలకు రూ.2 వేలు చెల్లిస్తోంది.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement