నాటి ఈగే నేటి డేగ! | Maria Corina Machado: Venezuela opposition leader special story | Sakshi
Sakshi News home page

నాటి ఈగే నేటి డేగ!

Published Sun, Jul 28 2024 4:29 AM | Last Updated on Sun, Jul 28 2024 4:29 AM

Maria Corina Machado: Venezuela opposition leader special story

వెనిజులా వేగుచుక్క మరియ

పన్నెండేళ్ల క్రితం ఓ రోజు – వెనిజులా నేషనల్‌ అసెంబ్లీలో ఆ దేశ అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌.. దూకుడు మీదున్న దేశ పురోగతి గురించి గంభీరంగా ప్రసంగిస్తూ ఉన్నారు. స్వపక్షాలు, విపక్షాలు భయభక్తులతో వింటూ ఉన్నాయి. అంతలో అపోజిషన్‌ బెంచీల నుంచి మరియ కొరీనా మచాదో లేచి నిలబడి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు! ‘‘మీ విధానాలు నిజంగా బాగున్నాయనే మీరు అనుకుంటున్నారా?’’ అని ఆమె ప్రశ్నించారు. ఆ మాటకు చావెజ్‌ ఆమె వైపు డిస్టర్బ్‌ అయిన సింహంలా తలతిప్పి చూశారు.

 తీవ్రమైన ఆగ్రహంతో, అసహనంతో.. ‘‘ఈగను డేగ వేటాడదు.. కూర్చో’’ అని పెద్దగా అరిచారు. దానర్థం ‘నువ్వో పిపీలికం. నీకు నేను సమాధానం చెప్పటం ఏమిటి!’’ అని. చావెజ్‌ ఇప్పుడు లేరు. పదకొండేళ్ల క్రితమే ఆయన మరణించారు. ఆ ఈగ మాత్రం ఇప్పుడు డేగ అయింది! చావెజ్‌ మరణించిన నాటి నుంచి రెండు దశాబ్దాలుగా వెనిజులాను పాలిస్తూ ఆ సంపన్న దేశాన్ని తన నియంతృత్వ పోకడలతో బికారిగా మార్చిన నికొలస్‌ మోరోస్‌ను తాజా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డేగలా వేటాడి వేటాడి, ఆ సామ్యవాద సింహానికి కంట కునుకు లేకుండా చేసింది.

ప్రజలు ఆమె వెన్నంటి...
తెల్లని దుస్తులు. మెడలో జపమాల. ఆత్మవిశ్వాసపు చిరునవ్వు. రోజంతా ప్రయాణం. సొట్టలు పడిన కారు పైభాగంలోనే నిలుచుని, ఎక్కడికక్కడ ప్రజల్ని ఉద్దేశించి ఆత్మీయంగా నాలుగు మాటలు. ప్రజల దగ్గరకు ఆమె వెళ్లటం అటుంచి, ప్రజలే ఆమె వెన్నంటి నడవటం. ఆమె వైపు చెయ్యందివ్వటం. మహిళలు ఆమె దోసిళ్లలో తలపెట్టి రోదించటం. కాపాడమని పురుషులు ఆమెను ్ప్రాధేయపడటం. రోడ్లు కిక్కిరిసిపోవటం. ఆమె మాట కోసం, ఆమె చూపు కోసం ఒకర్నొకరు తోసుకోవటం. ఒక యువకుడైతే తను గీసిన ఆమె చిత్రాన్ని అందివ్వటం. ఫ్రేమ్‌ లేని ఆ చిత్ర పటంలో ఆమె భుజాల చుట్టూ వెనిజులా జాతీయ జెండా. జెండాతో పాటుగా జీసెస్‌ చేతుల్లో సురక్షితంగా ఆమె. 

‘‘మరియా.. మాకు సహాయం చేయండి’’.. గుంపులోంచి ఒక ఉద్వేగం. 
56 ఏళ్ల మరియ కొరీనా మచాదో ఇప్పుడు వెనిజులా వేగుచుక్క. అధికార పక్షం గుండెల్లో పిడి బాకు. ఈ కొద్ది నెలల్లోనే ఒక ఉద్యమకారిణిగా, వెనిజులాకొక ఆశాదీపంలా అవతరించారు వెనిజులా విపక్ష నేత మరియ. ఆమె సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇళ్లలోంచి బయటికి వచ్చిన వేలాది మంది.. నేడు జరుగుతున్న వెనిజులా అధ్యక్ష ఎన్నికల బ్యాలట్‌ల వైపు లక్షలాదిగా కదులుతున్నారు. 

నిరంకుశ సామ్యవాద అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఓడించటమే వారి లక్ష్యం. అయితే ఈ ఎన్నికల్లో మరియ పోటీ చేయటం లేదు. తన తరఫున అంతగా ఎవరికీ తెలియని మాజీ దౌత్యవేత్త ఎడ్మండో గొంజాలెజ్‌ను నికోలస్‌కు వ్యతిరేకంగా నిలబెట్టారు మరియ. గొంజాలెజ్‌ గెలిస్తే మరియ గెలిచినట్లే. నికోలస్‌ ఓడిపోతే మరియ చేతుల్లో అతడు ఓడిపోయినట్టే. మరియకు గత ఏడాది జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో 93 శాతం ఓట్లు రావటం చూసి అధ్యక్ష ఎన్నికల్లో తన అపజయాన్ని శంకించిన అధ్యక్షుడు నికోలస్‌ వెనువెంటనే ఆమెపై ఆరోపణలు మోపి, సుప్రీం కోర్టు ద్వారా ఆమెను ఈ ఎన్నికలకు అనర్హురాలిని చేయించారు.

కేసులు.. భౌతిక దాడులు
మరియకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక గతవారమే వెనిజులా ప్రభుత్వం మరియ అంగరక్షకుల్ని తొలగించింది. ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిని చేయటం, అంగరక్షకుల్ని ఉపసంహరించు కోవటం.. ఇవేకాదు, నికొలస్‌ గత పదేళ్లుగా మరియాకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టించారు. కోర్టుకు ఈడ్చారు. భౌతిక దాడులు చేయించారు. అయినా ఆమె వెనకంజ వేయలేదు. నికొలస్‌ ఆర్థిక విధానాలతో నిరుపేద దేశంగా మారిన ఈ చమురు నిక్షేపాల సంపన్న దేశాన్ని ఒడ్డున పడేయటానికి ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు మరియ.                                                        

పిల్లలకు దూరంగా...
కుటుంబానికి ్ప్రాణహాని ఉందంటే పోరాటాన్ని తీసి ΄÷య్యిలో పడేస్తారు ఎవరైనా. కానీ మరియ తన పోరాటం ఆపలేదు. ప్రజలే తన కుటుంబం అనుకున్నారు. తన ముగ్గురు పిల్లల్ని – ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి – వారి భద్రత కోసం విదేశాలకు పంపించారు. వారు అమెరికాలో ఉన్నారని, కాదు బ్రిటన్‌లో ఉన్నారని అనుకోవటమే కానీ కచ్చితంగా ఏ దేశంలో ఉన్నారన్నది ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. ఈ పోరాటాల పోరు పడలేకే భర్త ఆమెతో విడిపోయారని అంటారు. 
మరియ తండ్రి వెనిజులా రాజధాని కరాకస్‌లో పేరున్న స్టీల్‌ బిజినెస్‌మన్‌. మరియ పుట్టింది కారకస్‌లోనే. మరియ తల్లి సైకాలజిస్ట్‌. మొత్తం నలుగురు ఆడపిల్లల్లో మరియ పెద్దమ్మాయి. మరియ పూర్తి పేరు మరియ కొరీనా మచాదో పరిస్కా. తండ్రి పేరులోని మచాదో, తల్లి పేరులోని కొరీనా పరిస్కా కలిసి వచ్చేలా ఆమెకు ఆ పేరు పెట్టారు. మరియ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. కరాకస్‌లోని వీధి బాలల కోసం 1992లో  ఒక అనాథాశ్రమం నెలకొల్పారు. 2002లో జాయిన్‌ అప్‌ అని అర్థం వచ్చేలా ‘సూమేట్‌’ అనే వాలంటీర్‌ల వ్యవస్థను ్ప్రారంభించారు. రాజకీయ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవటం, ప్రజా ప్రయోజన విషయాల మీద చర్చ వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటుంది ఆ సంస్థ. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement