కార్పొరేట్ ఉద్యోగులకు ఆరోగ్య చిట్కాలు
న్యూఢిల్లీ: నిత్యం కంప్యూటర్లతో కుస్తీ పట్టే కార్పొరేట్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించరు. వేళాపాళా లేని నిద్ర, కొత్త కొత్త ఆహారపు అలవాట్లు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్నే చూపిస్తాయంటున్నారు ‘హెల్ప్‌మీడాక్’ వెబ్సైట్ ఫౌండర్ సువ్రో ఘోష్. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఆయన కొన్ని చిట్కాలను చెప్పారు.
ఎల్లప్పుడూ నీళ్లబాటిల్: నిత్యం వాటర్‌బాటిల్‌ను వెంట తీసుకెళ్లడం మంచి అలవాటు. పనిలో పడి కొన్నిసార్లు నీరు తాగడం మర్చిపోతుంటాం. అయితే తరచూ నీటిని సిప్ చేస్తూ ఉండాలి. పళ్లరసాలు తాగితే ఇంకా మంచిది.
ఇంటి ఆహారం: ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే సలాడ్లు, ఆహారం చాలా మంచిది. మీరు కుటుంబానికి దూరంగా పనిచేయాల్సి వస్తోందని బయటిఫుడ్ తినాల్సిన పనిలేదు. తాజా పళ్లు, ఇంటి ఆహారం అందించే సంస్థలు చాలా ఉన్నాయి. వాటిలో ఆర్డర్ చేయండి. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి.
ఒత్తిడి వద్దు: ప్రతి గంటకూ రెండు నిమిషాలపాటు కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ఈ కొద్ది సమయం మీ సంస్థకేమీ నష్టం కలిగించదని గుర్తించండి. ఇది మీ మెదడును, మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది.
కుర్చీలో నిటారుగా: ఆఫీస్ కుర్చీలు ఎంతసేపు కూర్చున్నా సౌకర్యంగానే ఉంటాయి. అలా అని ఎలా పడితే అలా కూర్చోవద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ వెన్ను కుర్చీకు ఆన్చి నిటారుగా కూర్చొని పనిచేయండి.
నిద్ర: మీ శరీరానికి సరిపడా నిద్రించండి. 30 నిమిషాలు తక్కువైనా ఆ రోజంతా మెదడు, శరీరం చురుకుగా ఉండవు. ఇది దీర్ఘకాలిక దుష్ర్పభావాలు చూపుతుంది. వారాంతాలు సహా రోజుకు ఎనిమిది గంటల నిద్ర శరీరానికి మంచిది.
కెఫైన్‌కు నో: కెఫైన్ నిద్రను చెడగొడుతుందని తెలిసిందే. సాధ్యమైనంత వరకూ రాత్రిపూట కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్‌లను దూరం పెట్టండి. ఉదయాన్నే గ్లాసుడు పళ్లరసం, సాయంత్రాన ఓ కప్పు గ్రీన్ టీ శరీరానికి మేలు చేస్తాయి.