వైద్య సిబ్బందికే హెల్త్కార్డుల్లేవ్!
►వైద్య విధాన పరిషత్‌లో డాక్టర్లు, నర్సులు, ఉద్యోగుల గగ్గోలు
►ట్రెజరీ ద్వారా వేతనాలు పొందకపోవడమే వారికి శాపం
సాక్షి, హైదరాబాద్: వైద్య సిబ్బందికి కూడా హెల్త్కార్డుల్లేవు. వారి ఆరోగ్యానికి ప్రభుత్వం వైపు నుంచి భరోసా లేదు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరికీ ప్రభుత్వం హెల్త్‌కార్డులు ఇచ్చింది. కానీ, వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని విస్మరించింది. వీరు ప్రభుత్వ ఉద్యోగులే అయినా వారికి ఆరోగ్యకార్డులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకటో తేదీన వేతనాలు అందుకుంటే, వీరు నెలాఖరు వరకు ఆగాల్సి వస్తోంది. వీరికి గుర్తింపు కార్డులు లేవు.. మూడేళ్లుగా పదోన్నతులు లేవు. శాశ్వత ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే, అందులో పనిచేసే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వానం.
105 వైద్య విధాన ఆసుపత్రులు:
రాష్ట్రంలో 105 వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసుపత్రులున్నాయి. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నీ వైద్య విధాన పరిషత్ పరిధిలోనే పనిచేస్తున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 6,500 మంది శాశ్వత ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో దాదాపు 4 వేల మంది వరకు డాక్టర్లు ఉన్నారు. 1996లో వైద్య విధాన పరిషత్‌ను అటానమస్ సంస్థగా నెలకొల్పారు. అయితే తన కాళ్ల మీద తాను నిలబడే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం దానిని తన అధీనంలోకి తీసుకుంది. అయితే ఇందులో పనిచేసే ఉద్యోగులను 010 పద్దు కింద ట్రెజరీ పరిధిలోకి తీసుకురాలేదు. వీరి వేతనాలను ప్రభుత్వం రెండు, మూడు నెలలకోసారి విడుదల చేస్తోంది. ట్రెజరీ పరిధిలో లేకపోవడం, ఇతరత్రా సాంకేతిక కారణాలు చూపించి వీరికి హెల్త్‌కార్డులు ఇవ్వలేదు. మరోవైపు వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 158 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఏడేళ్లుగా క్రమబద్ధీకరణకు నోచుకోవడంలేదు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను ఏజెన్సీలు అందజేయడంలేదు.
సర్కారు పట్టించుకోవడంలేదు:
వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, వీరిని ట్రెజరీ పరిధిలోకి తీసుకురావాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడంలేదు.
- జూపల్లి రాజేందర్, వైద్య ఉద్యోగుల నేత