లక్కీ లవ్
ప్రముఖ నేపథ్య గాయకులు శ్రావణ భార్గవి, హేమచందర్లతో రూపొందిన లఘుచిత్రం ‘లక్కీ లవ్’. ప్రేమకు మంచి నిర్వచనమిస్తూ తీసిన అందమైన ఆమని కావ్యం ఈ మూవీ. లవ్ నిజంగానే లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో ఇష్టంగా ఒకరినొకరు ప్రేమించుకున్నప్పటికీ, వాస్తవ ప్రపంచంలోకి వ చ్చేసరికి ఆ ప్రేమ కాస్తా విఫలమైపోతుంటుంది.
అలా విఫలం కాని ప్రేమే ఈ లక్కీ లవ్. నిజ జీవితంలోనూ భార్యాభర్తలైన హేమచందర్, శ్రావణభార్గవి ఇందులో ఎంతో సహజంగా నటించారు. అందంగా కనిపించారు. దీన్ని ఓ అందమైన దృశ్యకావ్యంగా తీర్చిదిద్డాడు దర్శకుడు సుశాంత్ చింతకింది.రెండు రోజులకే ఈ షార్ట్ ఫిల్మ్ వ్యూయర్స్ 60 వేలు దాటింది. మంచి సంగీతం, కెమెరా, మాటలు, లొకేషన్స్, ఎక్స్ప్రెషన్స్... అన్నీ అద్భుతంగా కుదిరాయి ఇందులో.
‘22 వరకు ఏ అమ్మాయికైనా తన తండ్రే అన్నీ. 24 ఏళ్లు వచ్చేసరికి ఏ అమ్మాయికైనా పెళ్లనే భయం ఏర్పడుతుంది. నాకొచ్చే అమ్మాయికి మాత్రం రాజ్యం మారుతుంది కానీ, స్థానం మారదు. యూ ఆర్ మై ప్రిన్సెస్’ అని చెప్పిన ఈ డైలాగుతో భర్త కాబోయే భార్యను ఏ విధంగా చూసుకోవాలో చూపాడు ఈ దర్శకుడు. నిజమైన ప్రేమ అందరికీ దక్కదు. దొరికినప్పుడు ఎన్ని ఒడిదుడుకులెదురైనా కలిసే ఉండాలి... అంటూ షార్ట్ ఫిల్మ్ ముగుస్తుంది.
హైదరాబాద్ గీతం యూనివ ర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన సుశాంత్ చింతకింది తీసిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ ఇది. తనకు సినిమాలంటే చాలా ఇష్టమనీ, ఆ ప్యాషన్‌తోనే స్నేహితులందరితో కలిసి ఈ ఫిల్మ్ తీశానని చెప్పాడు. తొలి షార్ట్ ఫిల్మే అయినా... హేమచందర్, శ్రావభార్గవ్ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారని దర్శకుడు అభినందనలు కురిపించాడు. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి వాళ్లు ఈ చిత్రం చేసినందుకు ప్రత్యేకంగా హేమచందర్, శ్రావణ భార్గవి జంటకు కృతజ్ఞతలు’ చెబుతున్నాడు ఈ యువ దర్శకుడు.
డా. వైజయంతి