సాగుకు సాంకేతికత జోడించాలి
బుక్కరాయసముద్రం (శింగనమల): మారిన పరిస్థితులకనుగుణంగా సాగులో సాంకేతికతను ఉపయోగిస్తేనే దిగుబడులు సాధ్యమవుతాయని జేఎన్టీయూ(ఏ) ఫ్రొఫెసర్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో కోర్డినేటర్ డాక్టర్ లక్ష్మిరెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ‘‘సంకల్పంతో సిద్ధి’’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్షాలు లేక...వరుస కరువులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాకు సాగునీరు లేక పొలాలన్నీ బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
రైతులు ఏ యూనివర్శిటీల్లో చదువుకోక పోయినా శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఆలోచనలకు దీటుగా విజ్ఞానం కలిగి ఉన్నారన్నారు. వారికి ఆధునిక టెక్నాలజీ గురించి అవగాహన కల్పిస్తే బంగారు పంటలు పండిస్తారన్నారు. ఆ దిశగా శాస్ర్తవేత్తలు కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైతులకు సోలార్ సిస్టింలు అందజేస్తే విద్యుత్ లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వినిపించి రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీరామమూర్తి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ డాక్టర్ ఎల్లమందారెడ్డి, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి, రెడ్డిపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర, కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.