కనులపండువగా సిడిమాను ఉత్సవం
అమరాపురం (మడకశిర): అమరాపురం మండలం హేమావతి హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సిడిమాను ఉత్సవం కనుల పండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం వెండితో చూడముచ్చటగా అలంకరించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని కుడివైపున ఉన్న సిడిమాను వద్దకు తీసుకువచ్చి పూజలు చేశారు. పెద్ద సిడిమానుకు ఒకవైపు భక్తులు వేలాడుతుండగా... మరొకవైపు తిప్పుతుంటారు. మొక్కులు తీర్చుకునేవారు, కోరికలు కోరుకునేవారు పురాతనమైన మానును గాలిలో తిప్పుతూ దానికున్న తాడును పట్టుకుని పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల రోగాలు నయమవుతాయని, సంతానం కలుగుతుందని, పెళ్లి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులకు సర్పంచి సదాశివ, గ్రామపెద్దలు ప్రకాష్, కుమార్స్వామి అన్నదానం నిర్వహించారు. రాత్రి ముత్యాలపల్లకీలో స్వామివారిని ఊరేగించారు. సీఐ దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటస్వామి తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.