ఏర్పాట్లు బాగున్నాయి: కార్ల్సన్
చెన్నై: డిఫెండింగ్ ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఈ ఏడాది నవంబరులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై అతని ప్రత్యర్థి మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) సంతృప్తి వ్యక్తం చేశాడు. 22 ఏళ్ల ఈ ప్రపంచ నంబర్‌వన్ తన తండ్రి హెన్రిక్ కార్ల్సన్, మేనేజర్ ఎస్పెన్ అగ్డెస్టియన్తో కలిసి పోటీల వేదికైన స్థానిక ఫైవ్ స్టార్ హోటల్లో ఏర్పాట్లను పర్యవేక్షించాడు.
నవంబరు 7 నుంచి 28 వరకు జరిగే ఈ పోటీలో నెగ్గాలనుకునేవారు తమ సామర్థ్యంపై అపార విశ్వాసం కలిగి ఉండాలని భారత్‌లో తొలిసారి అడుగుపెట్టిన కార్ల్సన్ అన్నాడు. నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందంలో ‘అనారోగ్యం నిబంధన’ను చేర్చాకే ఆనంద్‌తో సొంతగడ్డపై ఆడేందుకు కార్ల్సన్ అంగీకరించాడు. ఈ నిబంధన ప్రకారం పోటీ సందర్భంగా తాను అస్వస్థతకు గురైతే రెండు రోజుల విశ్రాంతి ఇవ్వాలని కార్ల్సన్ షరతు విధించాడు. నిర్వాహకులు ఈ నిబంధనను అంగీకరించడంతో ఈ పోటీకి మార్గం సుగమమైంది.