అమెరికాలో డాక్టర్ కాల్పులు
న్యూయార్క్: తాను పనిచేసే ఆస్పత్రి నుంచి బహిష్కరణకు గురైన ఓ వైద్యుడు ఇంటికెళ్లి తుపాకీ తీసుకొచ్చి అదే ఆస్పత్రిలో కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఓ మహిళా వైద్యురాలు చనిపోగా మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే తొలుత ఉగ్రవాది ఈ చర్యకు దిగాడా అని పోలీసులు కంగారెత్తిపోయారు. కానీ, అదే ఆస్పత్రిలో గతంలో పనిచేసిన డాక్టరే ఈ పనిచేశాడని తెలిసి షాకయ్యారు. హెర్నీ బెల్లో (45) అనే వైద్యుడు గతంలో బ్రాంక్స్ లెబనాన్ ఆస్పత్రి పనిచేశాడు.
అయితే, అతడు ఆస్పత్రిలో లైంగిక వేధింపులకు పాల్పడటంతో అందులో నుంచి తొలగించారు. దీంతో కోపంతో రగిలిపోయిన బెల్లో తిరిగి ఆస్పత్రికి తెల్లటి కోటు, ఐడీ కార్డు ధరించి వెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది తొలుత అతడు మాములుగానే వచ్చాడని భ్రమపడ్డారు. దాంతో అతడిని తనిఖీ చేయలేదు. అదేసమయంలో కోటు లోపల పెట్టుకున్న తన తుపాకీని తీసుకొని నేరుగా 17వ ఫ్లోర్‌కు వెళ్లి ధనాధన్ కాల్పులు జరిపాడు. దీంతో ఓ మహిళా వైద్యురాలు చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అతడిని చుట్టుముట్టేలోగానే తనకు తాను నిప్పంటించుకొని అనంతరం దారుణంగా కాల్చుకొని చనిపోయాడు.