గుట్టంతా కాల్డేటాలోనే దాగుంది
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ పూర్తిగా బూటకమని మధురై కేంద్రంగా పనిచేస్తోన్న పీపుల్స్ వాచ్ సంస్థ డైరెక్టర్ హెన్రీ టిపాగ్నే అన్నారు. ఏపీలోకి ప్రవేశించిన తరువాత కూలీలను సజీవంగా పట్టుకున్న పోలీసులు.. డీఐజీ కార్యాలయం నుంచి అడవిలోకి తీసుకెళ్లి వారిని కాల్చిచంపారని మంగళవారం మానవహక్కుల వేదిక ఎదుట వాదనలు వినిపించారు.
కూలీల మొబైల్ ఫోన్లు లాక్కున్న పోలీసులు.. వాటినుంచే కూలీల కుటుంబ సభ్యులకు కాల్స్ చేసి బెదిరించారని, కాల్ డేటా బయటికివస్తే నిజానిజాలు వెల్లడవుతాయన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు కూలీల ఫోన్లన్నీ స్విచ్చాఫ్ అయ్యాయని, సాక్షుల వాగ్మూలాన్ని బట్టిచూస్తే తమ వాదన నూటికి నూరుపాళ్లూ నిజమేనని హెన్రీ అన్నారు.
పోలీసులు చేసిన కాల్స్ రికార్డయ్యాయని, వాటిని బయటపెట్టాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఎన్ హెచ్చార్సీ ఇప్పటికే ఆదేశించిందన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అన్నివిషయాలను దాటవేస్తోందని ఆరోపించారు. తమ దగ్గర ఉన్న పూర్తి వివరాలతో ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తామని, తగిన ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నామని హెన్రీ పేర్కొన్నారు.