విజయవాడలో కిడ్నాప్ కలకలం
విజయవాడ : నగర శివారులోని ఎనికేపాడులో ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేశారంటూ శనివారం గ్రామంలో కలకలం రేగింది. బాలిక మేనమామ తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపాడులో శివప్రసాద్, చాముండేశ్వరి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారై వాసవి ఆరో తరగతి చదువుతోంది. బాలిక శనివారం ఉదయం పాఠశాలకు వెళుతున్నప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు మినీ వ్యాన్లో బలవంతంగా ఎక్కించుకున్నారు. వాసవి అరవకుండా నోటికి చేతులు అడ్డుపెట్టి మత్తు ఇంజక్షన్ చేశారు. అపస్మారకస్థితికి చేరుకున్న బాలికను ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం వెనుక వీధిలోని ఓ ఇంట్లో బంధించారు.
మెళకువ వచ్చి చూసేసరికి గదిలో ఎవరూ లేరు. బయట నుండి గడియ పెట్టి ఉంది. దీంతో బాలిక గది వెనుక ఉన్న చిన్న రంధ్రం నుంచి బయట పడింది. ఏడుస్తూ రోడ్డు మీద వెళుతుండగా ఓ మహిళ చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. చేతులకు గాయలై రక్తం కారుతుండడంతో శుభ్రం చేసి ప్రాథమిక చికిత్స చేసింది. అనంతరం వాసవి తల్లి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. జరిగిన సంఘటన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వగా బాలికను పోలీసులు వాహనంలో ఎక్కించుకుని కిడ్నాపర్లను గుర్తుపట్టేందుకు ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు గ్రామాల్లో వెదికారు. తనను బంధించిన గదిని ఎక్కడనేది గుర్తించలేకపోవడం తో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు కోమరవల్లి కిషోర్.. వాసవి తల్లిదండ్రులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.