విద్యార్థిని గర్భవతి అయిందని..!
అమెరికాలోని మేరిల్యాండ్లో గర్భవతి అయిన ఓ విద్యార్థినిని స్నాతకోత్సవ వేడుకకు హాజరుకాకుండా నిషేధించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ఈ విషయమై ప్రజల నుంచి, జాతీయ అబార్షన్ వ్యతిరేక సంఘాల నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. వచ్చేవారం జరగనున్న స్నాతకోత్సవానికి సదరు విద్యార్థిని అనుమతించరాదన్న తన నిర్ణయంపై మేరిల్యాండ్ హాజర్స్టౌన్లోని హెరిటేజ్ అకాడమీ వెనుకకు తగ్గడం లేదు.
సీనియర్ విద్యార్థిని అయిన మ్యాడీ రంక్లెస్ లైంగిక కలాపాల్లో పాల్గొనడం ద్వారా తమ పాఠశాల నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే సహ విద్యార్థులతోపాటు ఆమెకు స్నాతకోత్సవ వేదికపై డిప్లోమా పట్టా అందజేయడం లేదని పేర్కొంది. ఆమె గర్భవతి అయినందుకు కాదు.. కానీ అనైతిక చర్యల్లో పాల్గొన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ డేవిడ్ హాబ్స్ రాసిన లేఖలో పేర్కొన్నారు.
18 ఏళ్ల రంక్లెస్ 2009 నుంచి హెరిటేజ్ అకాడమీ స్కూల్లో చదువుతున్నది. గత జనవరిలో ఆమె గర్భవతి అని తేలింది. అప్పట్లో ఆమె తండ్రి స్కూల్ బోర్డు మెంబర్గా ఉండేవారు. మొదట ఆమెను స్కూల్ నుంచి బహిష్కరిస్తామని, విద్యార్థి కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తామని పాఠశాల యాజమాన్యం హెచ్చరించింది. ఏడాదిపాటు ఇంటివద్దే ఉండి చదుకోవాలని చెప్పింది. అయితే, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేయడంతో 14మంది తోటి విద్యార్థులతో కలిసి ఆమె కూడా తరగతులకు హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, తోటి విద్యార్థుల తరహాలో ఆమె కూడా స్నాతకోత్సవ వేడుకలో డిప్లమా పట్టా అందుకోవడానికి పాఠశాల అనుమతించకపోవడాన్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. స్కూలు యాజమాన్యం నిర్ణయం సరైనది కాదని అంటున్నారు. వారికి అమెరికాలోని హక్కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.