బ్లాక్‌లిస్ట్‌లోని సంస్థకు రూ.333 కోట్ల పనులా?
సాక్షి, హైదరాబాద్: ‘చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలను అమర్చడంలో విఫలమైన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌ను మీ ప్రభుత్వమే బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అలాంటి సంస్థకు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.333 కోట్ల పనిని ఎలా అప్పగిస్తారు? హెరిటేజ్ పుడ్స్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న వేమూరి హరిప్రసాద్ టెరా సాఫ్ట్వేర్ సంస్థకు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంటే.. అస్మదీయ సంస్థకు రూ.333 కోట్ల పనిని దొడ్డిదారిన కట్టబెట్టారన్నది స్పష్టమవుతోంది. దీనిపై విచారణ జరిపి.. చర్యలు తీసుకునే దమ్ముందా?’ అంటూ సీఎం చంద్రబాబుకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ లేఖ ద్వారా సవాల్ విసిరారు.
లేఖ సారాంశమిదీ.. : ‘రాష్ట్రంలో ప్రతి గ్రామానికీఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ పనులకు రూ.333 కోట్లకు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ అందులో ఈ-గవర్నెన్స్ అథారిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీలో సభ్యుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. ఈయన టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్‌కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దాని సోదర సంస్థ టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్.
మే 11న బ్లాక్‌లిస్ట్‌లోకి టెరా..: రాష్ట్రంలోని చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు అమర్చే పనులను టెరా సాఫ్ట్ట్వేర్ లిమిటెడ్ సంస్థ చేజిక్కిచుకుంది. కానీ.. ఆ యంత్రాలను అమర్చడంలో విఫలమైంది. దాంతో.. టెరా సాప్ట్వేర్ లిమిటెడ్‌ను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్) బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ ఈ ఏడాది మే 11న ఉత్తర్వులిచ్చింది. కానీ.. రూ.333 కోట్లతో చేపట్టిన పైబర్ గ్రిడ్ ప్రాజెక్టును టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్‌కు కట్టబెడుతూ నవంబర్ 2న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ పుడ్స్‌లో డెరైక్టర్‌గా వ్యవహరిస్తోన్న దేవినేని సీతారామయ్య 2014, సెప్టెంబర్ 30 వరకూ టెరా సాఫ్ట్వేర్ లోనూ డెరైక్టర్‌గా పనిచేశారు. హెరిటేజ్ పుడ్స్‌కు, టెరా సంస్థల ఆడిటింగ్ వ్యవహారాలను ఆర్ఎస్ బక్కన్నావార్ చక్కబెడుతున్నారు.
హెరిటేజ్ అనుబంధ సంస్థల్లో డెరైక్టర్‌గా పనిచేస్తోన్న కోలార్ రాజేష్ సీతపల్లి గ్యాస్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ కూడా ఆ సంస్థలో డెరైక్టర్‌గా ఉన్నారు. అందుకే బ్లాక్ లిస్ట్‌లో పెట్టామన్న అంశాన్ని కూడా విస్మరించి టెరా సాప్ట్వేర్ లిమిటెడ్‌కు రూ.333 కోట్ల పైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను అక్రమంగా కట్టబెట్టారు. దీనిపై విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోవాలి’ అని చంద్రబాబుకు ఉండవల్లి సవాల్ విసిరారు.