స్నేహానికి చిరునామా మస్తాన్బాబు
ఫేస్బుక్లో హెర్నన్ బృందం
సంగం: అర్జెంటీనాలోని ఆండిస్ పర్వతాల్లో మృతి చెందిన మస్తాన్బాబు స్నేహానికి ప్రతీక అని స్నేహితులైన హెర్నన్ బృందం ఫేస్బుక్లో కొనియాడింది. మల్లి మస్తాన్బాబు మృతదేహం కనుగొన్నప్పటి నుంచి భారతదేశానికి తరలించడంలో ఈ బృందం కృషి మరువలేనిది. రెండు దేశాల హెలికాప్టర్లు గాల్లో చక్కర్లు కొట్టినా మస్తాన్బాబు జాడను కనుగొనలేకపోయాయి. అయితే హెర్నన్ బృందం రంగంలోకి దిగి మస్తాన్బాబు మృతదేహాన్ని కనుగొంది. తమతో అప్పటివరకు గడిపిన మస్తాన్బాబు విగతజీవిగా పడివుండడం చూసి జీర్ణించుకోలేకపోయామని ఈ బృందం ఫేస్బుక్లో పేర్కొంది.
భారతీయుడైన మస్తాన్బాబు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాడని పేర్కొంది. అగ్నికీలలు ఎగిసిపడుతున్నా అగ్ని పర్వతాలను అవలీలగా అధిరోహించిన ధైర్యశాలి అని మస్తాన్ స్నేహితులు పేర్కొన్నారు. తనను అక్కున చేర్చుకున్న ప్రకృతి అంటే మస్తాన్బాబుకు ఎనలేని ఇష్టమని, పర్వతారోహణ సమయంలో వేడి నీళ్లను గాలిలోకి వ దిలి తిరిగి తనపై చల్లని నీరుగా పడటాన్ని తీపి అనుభూతిగా తమతో పంచుకునేవాడని తెలిపింది. సమయపాలన, కార్యదీక్ష, పట్టుదల, కృషికి మారుపేరు మస్తాన్బాబు అని గుర్తుతెచ్చుకున్నారు. అటువంటి ధీరుడు ప్రపంచంలో లేడని హెర్నన్ బృందం చెబుతూ కన్నీటపర్యంతమైంది.
మృతదేహం తరలింపు నేడు
మస్తాన్బాబు మృతదేహాన్ని బుధవారం అర్జెంటీనా నుంచి తరలించనున్నారు. హెర్నన్ బృందం తరలింపు ప్రక్రియను పూర్తిచేసింది. మరణ ధ్రువీకరణ పత్రం, భారతదేశానికి పంపే ధ్రువీకరణ పత్రం, పోస్ట్మార్టం నివేదికలన్నీ పూర్తిచేశారు. మస్తాన్బాబు సోదరి డాక్టర్ దొరసానమ్మకు యూరోపియన్ వీసా లేకపోవడంతో ప్రక్రియ జాప్యమైంది. దీంతో మంగళవారం మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు విమానయానానికి కావాల్సిన ప్రక్రియను పూర్తిచేశారు. బుధవారం మృతదేహాన్ని ఏజియా నుంచి దోహాకు తరలిస్తారు. అక్కడి నుంచి 24వ తేదీన ఉదయం 7 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి తేనున్నారు. అక్కడ భారత విదేశీ వ్యవహారశాఖ ఆధ్వర్యంలో చెన్నై విమానాశ్రయానికి, అక్కడి నుంచి నెల్లూరు జిల్లా సంగం మండలంలోని మస్తాన్బాబు స్వగ్రామం గాంధీజనసంఘంకు తరలించనున్నారు.