ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!
‘‘నాన్నగారు రూపొందించిన సినిమాలకు ఏయమ్ రత్నంగారు పనిచేశారు. అప్పటినుంచి ఆయన పరిచయం. కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో మంచి విజయవంతమైన చిత్రాలు తీశారు. అజిత్‌తో ఇది మూడో సినిమా. తమిళంలో లాగే తెలుగులో కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎన్నై అరిందాల్’ను ‘ఎంతవాడు గానీ...’ పేరుతో ఎ.ఎమ్.రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకుడు.
ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, హీరో గోపీచంద్‌కు అందజేశారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ -‘‘ఏయమ్ రత్నంగారు నిర్మించిన ‘జెంటిల్‌మ్యాన్’ చూసి ఆయనకు అభిమానిగా మారాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయన తెలుగులో మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఏయం రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు.