మార్చికల్లా హీరో 15 కొత్త మోడల్స్
మకావూ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ 15కు పైగా కొత్త ఉత్పత్తులను ( కొత్త టూవీలర్లు, ప్రస్తుతమున్న మోడళ్లలో కొత్త వేరియంట్లు కూడా కలిపి) మార్కెట్లోకి తేనున్నది. పండుగల సీజన్ సందర్భంగా అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో ఈ కొత్త ఉత్పత్తుల్లో అధిక భాగం ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ ఎండీ, సీఈవో పవన్ ముంజాల్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన హీరో గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
అమ్మకాలు బావుంటాయ్.. : వర్షాలు బాగా కురిసాయని, సెంటిమెంట్ మెరుగుపడిందని, ఇటీవలి ఆర్బీఐ నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉన్నాయని, ఈ పండుగల సీజన్లో అమ్మకాలు జోరుగా ఉంటాయని పవన్ అభిప్రాయపడ్డారు. అమ్మకాలకు సంబంధించి అధ్వాన పరిస్థితులు అంతమయ్యాయని, ఇప్పుడు టూవీలర్ నిత్యావసరంగా మారిందని వివరించారు. వినూత్నమైన ఫీచర్లతో కొత్త టూవీలర్లను రూపొందిస్తున్నామని, వీటికి పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని వివరించారు. హై ఎండ్ బైక్, కరిజ్మాను అప్‌గ్రేడ్ చేసి కొత్త వేరియంట్‌ను హీరో మోటొకార్ప్ తెస్తోంది. అమెరికాకు చెందిన ఇరిక్ బ్యుయెల్ రేసింగ్(ఈబీఆర్) కంపెనీతో జట్టు కట్టిన తర్వాత ఇరువురి భాగస్వామ్యంలో తొలిగా వస్తోన్న బైక్ ఇది. ఇక హోండా భాగస్వామ్యంతో కాకుండా తాము సొంతంగా డెవలప్ చేసుకున్న టెక్నాలజీతో తయారు చేసిన తొలి బైక్‌ను వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తామని పవన్ చెప్పారు. కాగా జపాన్‌తో చెందిన హోండాతో భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత హీరో కంపెనీ దూకుడుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది