తమిళనాడు ఎన్నికల్లో ఆరుగురు హిజ్రాలు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు హిజ్రాలు పోటీకి దిగుతున్నారు. వీరిలో ఒకరు ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల జాబితాల్లో పురుషుల సంఖ్య అధికంగా ఉండేది. క్రమేణా స్త్రీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, ఈసారి ఎన్నికల్లో ఆశ్చర్యకరంగా కొన్ని పార్టీలు హిజ్రాలకు అవకాశమివ్వడంతో వారి పేర్లు అభ్యర్థుల జాబితాలో చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో ఆరుగురు హిజ్రాలు పోటీకి దిగుతున్నారు. ఆర్కేనగర్ నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా జయలలిత పోటీచేస్తుండగా, అదే స్థానంలో దేవీ అనే హిజ్రాకు నామ్ తమిళర్ కట్చి అవకాశం కల్పించింది.
అలాగే, డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా పోటీకి దిగుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో మధురై నుంచి స్వతంత్య్ర అభ్యర్థి భారతికన్నమ్మ రంగంలో నిలవడం ద్వారా ఎన్నికల్లో పోటీచేసిన తొలి హిజ్రాగా రికార్డు నెలకొల్పారు. ఆ ఎన్నికల తరువాత హీరో శరత్‌కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చిలో భారతికన్నమ్మ చేరారు. ఆ తరువాత అభిప్రాయబేధాలతో పార్టీ నుంచి వైదొలిగారు. హిందు మక్కల్ కట్చి తరపున మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి అనసూయ అనే హిజ్రా పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మదురై దక్షిణం నుంచి పోటీ చేస్తున్నట్లు భారతి కన్నమ్మ తెలిపారు.
ఏదైనా పార్టీ తరఫునా.. లేదా స్వతంత్య్ర అభ్యర్థిగానా.. అనేది రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. హిజ్రాలు తమ హక్కుల సాధన కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కన్నమ్మ అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనతో కలిపి మొత్తం ఆరుగురు హిజ్రాలు పోటీ చేస్తున్నారని చెప్పారు.