వంద మంది కథా నాయకులను అందిస్తా
స్టార్ ఫిల్మ్ మేకర్ సత్యానంద్
సీతమ్మధార: విశాఖలో పుట్టిన తనకు ఎంతో మంది సినిమా నటులను తీర్చిదిద్దే అవకాశం కల్పించిన కళామతల్లికి సర్వదా రుణపడి ఉంటానని ఫిల్మ్ స్టార్ మేకర్ ఎల్.సత్యానంద్ అన్నారు. సీతమ్మధారలో నూతనంగా ఏర్పాటు చేసిన మిరాకిల్ డాన్స్ అకాడమీని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చలన చిత్రరంగానికి 100 మంది కథానాయకులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు.
ఇప్పటి వరకు తెలుగు సినీ రంగంలో ఎంతో కీర్తినార్జించిన 85 మంది ప్రముఖ కథానాయకులకు శిక్షణ ఇచ్చిన భాగ్యం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. మిరాకిల్ డాన్స్ అకాడమీ డెరైక్టర్ ఎం.డి.షకీల్ మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించి ఇప్పటికి పదేళ్లు పూర్తకావస్తుందన్నారు. నగరంలో అక్కయ్యపాలెం, ఎం.వి.పి.కాలనీలలో ఇప్పటికే తమ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు సీతమ్మధారలో నూతనంగా ప్రారంభించి బ్రాంచ్లో శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ ఓక్ ఫ్రీ స్కూల్ ైడె రెక్టర్ పి.వి.రాజు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.