పోతున్న ప్రాణాలు ఒడిసిపట్టింది
బ్రిస్టల్: 'ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే బతికుండే వాడు' సాధారణంగా ఇది అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వైద్యుల నోట వినిపించే డైలాగ్. ఈ మాట వినగానే అతడి తలరాత అంతేలే అందుకే చనిపోయాడని అనుకుంటాం. కానీ, వాస్తవానికి ఆ నిమిషానికి సరిగ్గా కాపలా కాస్తే పోయే ప్రాణాన్ని అరచేతపట్టుకొని తిరిగి ఆ వ్యక్తిని బతికించవొచ్చని బ్రిస్టల్ నగరంలో నిరూపితం అయింది. పట్టపగలే కత్తిపోట్లతో పడి ఉన్న ఓ 40ఏళ్ల బిల్డర్ను చూసి అందరూ తమకెందుకులే అని వెళ్లిపోతుండగా నర్సుగా పనిచేస్తున్న ఆమె మాత్రం ఆగిపోయింది.
తన స్నేహితుడితో కలిసి అతడి వద్దకు గబాగబా వెళ్లి మొకాలిపై కూర్చొని అతడి ప్రాణం కోసం ఎంతో ఆరాటపడింది. అతడు ఎవరూ ఏమిటీ అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. డిగ్నిటీ అనే అహంకారానికి వెళ్లకుండా నేరుగా అతడి చేయి చేతుల్లోకి తీసుకొని పల్స్ చెక్ చేసింది. శ్వాస కూడా ఆగిపోయిన ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) పద్ధతి ద్వారా తిరిగి ఊపరిపోసింది.
అంతకుముందు అతడి ఛాతీపై తన శాయశక్తులా బలంగా నొక్కుతూ క్షణాల్లో దూరమవుతున్న ఆయుషును తిరిగి తనకు అందించింది. అలా దాదాపు ఐదు నిమిషాలపాటు రోడ్డుపక్కనే ఓ ప్లాట్ ఫాం పై పడుకోబెట్టి ఆమె చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆ వెంటనే బాధితుడిని బ్రిస్టల్ లోని సౌత్ మెడ్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టింది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగానే ఉంది.