ఏదైనా డైరెక్ట్‌గానే.. యువ నటి
ఏదైనా ఫేస్ టు ఫేస్ బెటర్ అంటోంది బాలీవుడ్ యువ నటి సయేషాసైగల్. బాలీవుడ్ బిగ్ సినీ వారసత్వం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెరంగేట్రం మాత్రం టాలీవుడ్లో చేయడం విశేషం అని చెప్పాలి. నటుడు నాగార్జున వారసుడు అఖిల్ కథానాయకుడిగా పరిచయం అయిన ‘అఖిల్’ చిత్రంతో నాయకిగా పరిచయం అయిన సయేషా ఆ చిత్రంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌తో నటించిన శివాయ్ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడికి కోలీవుడ్ నుంచి కాలింగ్ వచ్చింది. తాజాగా జయంరవితో వనమగన్‌తో తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ అదరగొట్టి ఆ పాటకు నృత్య దర్శకత్వం వహించిన ప్రభుదేవానే విస్మయ పరచిందట. ఇక చిత్ర దర్శకుడిని విపరీతంగా ఆకట్టుకున్న సైగల్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయట. వనమగన్ చిత్ర విడుదలకు ముందే కరుప్పురాజా వెళైరాజా వంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సయేషా మరి కొన్ని చిత్రాల్లో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట.
ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు కథ ఇప్పటి నుంచే మొదలైంది. సయేషా కాల్షీట్స్ ఇప్పిస్తానని, ఆమె మేనేజర్ తానేనంటూ కొందరు బురిడీ బాబులు పుట్టుకొచ్చారట. ఈ విషయం నటి సయేషా దృష్టికి రావడంతో వెంటనే రియాక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు చిత్రాల విషయం గాని, ఇతర కార్యక్రమ విషయాలు ఏవైనాగాని తనతో, తన తల్లితోగాని డైరెక్ట్‌గా చర్చించాలి. అంతే గాని తనకంటూ మేనేజర్ ఎవరూ లేరని తన ట్విట్టర్లో పేర్కొంది.