Hey Jude
-
నన్ను బాధపెట్టడం అంత వీజీ కాదు!
ఈజీ అనాలి కదా.. వీజీ అంటున్నారేంటి అనుకుంటున్నారా? కొంచెం ఎటకారంగా.. అదేనండీ వెటకారంగా చెప్పాలంటే వీజీ అంటారు కదా. ఒక విషయం గురించి త్రిష ఇలా వ్యంగ్య ధోరణిలోనే మాట్లాడారు. అదేంటంటే... ఫేస్బుక్, ట్విట్టర్లో ఏదైనా కామెంట్ పెట్టి, దానికి తగ్గట్టు సెలబ్రిటీల ఫొటోలు పెడుతుంటారు కదా. ఆ ఫొటోలో స్టార్ ఎక్స్ప్రెషన్ ఆ కామెంట్‌కి తగ్గట్టుగా ఉంటుంది. త్రిష ఫొటోలు ఇలాంటివి చాలానే వైరల్ అయ్యాయి. ‘‘కొన్ని బాగానే ఉంటాయి. కొన్ని ఫొటోలు, కామెంట్స్ మాత్రం బాగుండవు. అలాంటివి చూసి, బాధపడతారా? అని నన్నడిగితే.. ‘అస్సలు బాధపడను’ అని చెబుతా. నన్ను బాధపెట్టడం అంత వీజీ కాదు’’ అన్నారు త్రిష. స్టార్ అయ్యాక ఇలాంటివి కామన్ కాబట్టి, అలవాటై త్రిష లైట్ తీసుకున్నారేమో అనుకుంటున్నారా? అదేం కాదు. నటి కాకముందు కూడా ఇలానే ఉండేవారట. ఆ విషయం గురించి త్రిష చెబుతూ – ‘‘నా గురించి ఎవరైనా చేయకూడని కామెంట్ చేస్తే పట్టించుకునేదాన్ని కాదు. బాధపడేదాన్ని కాదు. ఒకవేళ తట్టుకోలేనంత బాధ అనిపిస్తే.. అప్పుడు మా అమ్మకి, ఫ్రెండ్స్‌కి చెబుతాను. అంతా విని, వాళ్లు ఒక్కసారిగా నవ్వేస్తారు. అప్పుడా బాధ జోక్ అయిపోతుంది’’ అన్నారు. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం త్రిష చేస్తోన్న వాటిలో మలయాళ చిత్రం ‘హే జ్యూడ్’ ఒకటి. ఈ చెన్నై చందమామ ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట. -
హే జూడ్... రెడీ ఫర్ రైడ్!
ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో! త్రిష రైడ్ చేస్తున్న బండి కలర్ కూడా బ్లూనే! ఆమె వెనుక సీట్లో కూర్చున్నది ఎవరో తెలుసా? మలయాళ హీరో నివిన్ పాలీ. త్రిష మాటలతో ఏం మంత్రం వేశారో మరి... నీలాకాశంలో విహరిస్తున్నట్టుంది నివిన్ ఎక్స్ప్రెషన్. అసలు, ఈ హీరో త్రిష బండి ఎందుకు ఎక్కారనే డౌటొచ్చిందా? ప్రస్తుతం వీళ్లిద్దరూ ‘హే జూడ్’ అనే మలయాళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌నే మీరు చూస్తున్నారు. శ్యామప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రిష్టల్ అనే అమ్మాయిగా త్రిష, జూడ్ అనే అబ్బాయిగా నివిన్ నటిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే... నివిన్ని ‘హే జూడ్... ఆర్ యు రెడీ ఫర్ రైడ్?!’ అని త్రిష అడుగుతున్నట్టు లేదూ! ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ‘‘సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్రదర్శకుడు శ్యామప్రసాద్ పేర్కొన్నారు. మలయాళంలో త్రిషకు తొలి చిత్రమిది. హీరోయిన్ అయిన 15 ఏళ్ల తర్వాత... పలు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన తర్వాత... ఇన్నేళ్లకు మలయాళంలో ఎంట్రీ ఇస్తుండడం విశేషం!! -
తప్పు తప్పే... శుద్ధ తప్పే!
ఆయన చెబుతున్నారు! త్రిష వింటున్నారు! ఒక్క మాటకు కూడా ఎదురు చెప్పడం లేదు. ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేసేస్తున్నారు. ఇంతకీ, త్రిషను అంతలా కంట్రోల్లో పెట్టుకున్న ఆయనెవరు? అంటే... ఫొటోలో కళ్లజోడు పెట్టుకుని, కాస్త నెరిసిన జుట్టుతో ఉన్నారు చూడండి ఆయనే! మలయాళీ దర్శకుడు శ్యామ్ ప్రసాద్. ప్రస్తుతం త్రిష హీరోయిన్గా ‘హే జ్యూడ్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలి హీరో. జనరల్‌గా షూటింగ్ లొకేషన్లో హీరో హీరోయిన్లు, దర్శకుడు మధ్య సీన్స్ గురించి డిస్కషన్స్ జరుగుతాయి. కానీ, ‘హే జ్యూడ్’ లొకేషన్లో అంతా వన్‌వే ట్రాఫిక్. శ్యామ్ ప్రసాద్ రూటులో అందరూ నడుస్తున్నారు. సెట్లో ఒకరు ‘ఏంటిది? మీరేం క్వశ్చన్ చేయడం లేదు? డైరెక్టర్ బాగానే తీస్తున్నాడా?’ అని త్రిషను అడిగితే... ‘‘హి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఆయన ట్రాక్ రికార్డు చూశావా? శ్యామ్ తీసిన పన్నెండు సినిమాల్లో మూడింటికి ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ మలయాళం’ అవార్డ్స్ వచ్చాయి. ఆయనకు ఏడు స్టేట్ (కేరళ) అవార్డ్స్ వచ్చాయి. టాలెంట్ ఉన్నోడిని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. తప్పు తప్పు... శుద్ధ తప్పు’’ అని చెప్పారట. అదండీ మేటర్!!