బీడీల్లానే కాలిపోతున్నాం
'చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండి లేదు. రోగమొస్తే చూపించుకునేందుకు ఈఎస్ఐ ఆస్పత్రి లేదు. అసలు ప్రభుత్వం మమ్ములను పట్టించుకోవడం లేదు. మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదు. బీడీల్లా కాలిపోతున్న మా బతుకులను బాగు చేయండి మేడం' అంటూ బీడీ కార్మికులు బీడీ కార్మికుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు మెదక్ వచ్చిన రాష్ట్ర మహిళ సాధికారత కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య ఎదుట తమ బాధలు ఏకరువు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికుల స్థితిగతులను నేరుగా తెలుసుకుని కార్మికుల పరిస్థితిపై అధ్యాయం చేసేందుకు రాష్ట్ర మహిళ సాధికారత కమిటీ చైర్పర్సన్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య నేతృత్వంలో నియమించిన ప్రభుత్వ హైపర్ కమిటీ బృందం మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో పర్యటించింది.
కమిటీ బృందంలోని సౌమ్యమిశ్ర, స్వాతిరత్న, సురేష్, సునీల్‌శర్మలతో పాటు రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ అశోక్ తదితరులు పట్టణంలోని రాంనగర్, మండలంలోని పొన్నాల గ్రామంలో కమిటీ సభ్యులు బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. కార్మికులతో ఆత్మీయంగా పలకరిస్తూ వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు కార్మికులను పలు ప్రశ్నలను అడిగారు. రోజుకు ఎన్ని బీడీలు చుడతారు..? అందరికి పీఎఫ్ సౌకర్యం ఉందా..? బీడీలను ఎక్కడ అందజేస్తారు..? నెలకు ఎన్ని రోజుల పని ఉంది..? ఎప్పటి నుంచి బీడీలు చుడుతున్నారు..? పనిలో ఎలాంటి అరోగ్య సమస్యలు కలుగుతున్నాయి..? ఆస్పత్రులు అందుబాటులో ఉన్నాయా..? మీ పిల్లలు ఎం చేస్తున్నారు..? బీడీ సంస్థల నుంచి ఏమైనా ఇబ్బందులున్నాయా..? అని ప్రశ్నించగా, కార్మికులు కంట నీరు పెడుతూ తాము పడుతున్న బాధలను గద్గద స్వరాలతో వెలిబుచ్చారు.
ఎక్కువ మందిమి రోజుకు 500-600 బీడీలు చుడుతున్నామనీ, వెయ్యి బీడీలు చేసేవారు చాలా తక్కువని చెప్పారు. పిల్లల పనులు చేసుకుంటూ ఎక్కువ బీడీలు చేయలేకపోతున్నామనీ, నెలలో 12 రోజుల పని మాత్రమే ఉంటోందన్నారు. మిగితా రోజుల్లో పనిలేక ఇబ్బందులు పడుతున్నామని తమ దీన స్థితిని వెల్లడించారు. ఏళ్ల నుంచి పని చేసినా పీఎఫ్ సౌకర్యం లేదని, బీడీ రంగంలో పని చేయడంతో క్యాన్సర్, తలనొప్పులు, కంటి చూపు, ఒల్లు నొప్పుల సమస్యలతో సహవాసం చేస్తూ రోగాల పాలవుతున్నామని చెప్పారు. వయస్సు మీదపడుతుండడంతో మరో పని చేయలేని పరిస్థితిలో ఉన్నామనీ, కనీసం ఈఎస్ఐ ఆస్పత్రి సౌకర్యం లేదని కమిటీ సభ్యులకు తెలిపారు. పెరిగిన ధరలతో కూలీ సరిపోక, పని లేక కుటుంబం గడవడం భారం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు 21-25 రోజుల పని కల్పించాలని, కూలీ రేట్లను పెంచాలని, పిల్లలకు స్కాలర్ షిప్‌లు అందించాలని, జీవన భృతిని రూ. వెయ్యి చెల్లించాలని, కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతే జీవితాలు దుర్భరమవుతాయని కమిటీ ఎదుట మొరపెట్టుకున్నారు.
బీడీ కార్మికుల సమస్యలు నివేదిస్తాం
అనంతరం కమిటీ చైర్పర్సన్, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీడీ కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి సిద్దిపేటకు వచ్చినట్లు చెప్పారు. బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని ఆమె కార్మికులకు భరోసా కల్పించారు. తెలంగాణ రాష్ట్ర బీడీ కార్మిక సంఘం ప్రతినిధులు సిరాజుద్దీన్, ప్రేమ్‌పావని, సామల మల్లేశం, శోభ, చింతల మల్లేశం, ఎక్భాల్లతో పాటు తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు గోపాల స్వామి, గ్యాదరి జగన్‌లు కార్మికులకు జీవన భృతిని రూ.1000 ఎలాంటి షరతులు లేకుండా చూడాలని వినతి పత్రం అందజేశారు. కమిటీ సభ్యుల వెంట జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, తహశీల్దార్ ఎన్వై గిరి, పీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, పొన్నాల గ్రామ సర్పంచ్ తుపాకుల ఎల్లమ్మ, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ ఉన్నారు.