ఉత్తర ప్రదేశ్ లో హై అలర్ట్..
ఉత్తరప్రదేశ్ః సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ అప్రమత్తమైంది. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇండో నేపాల్ సరిహద్దుల్లోని లక్నో, ఆగ్రా, కాన్పూర్, మీరట్ శిబిరాల్లో పోలీసు బలగాలు పరిథిని విస్తరించారు. పాకిస్థాన్ నుంచి ప్రతీకార దాడులు జరిగే భయంతో ముందు జాగ్రత్త చర్యగా అన్ని జిల్లాల్లో భద్రతను పెంచారు.
ఇండో-నేపాల్ సరిహద్దు వెంబడి నిఘాను పెంచాలని బోర్డర్ సెక్యూరిటీకి చెందిన సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) కోరింది. పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం జరిపిన దాడులతో ఉత్తర ప్రదేశ్ లోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలతోపాటు, జనసామర్థ్యం అధికంగా ఉండే రైల్వే బస్స్ స్టేషన్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, థియేటర్లతోపాటు బహిరంగ ప్రదేశాల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే సైనిక స్థావరాలు, విమానాశ్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సరిహద్దుల్లోని మహారాజ్‌గంజ్, బహ్రైచ్, గోండా, గోరఖ్‌పూర్ వంటి ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి వాహనాల కూడా తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా చర్యలతోపాటు, నిఘా వ్యవస్థ ద్వారా కూడా ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.