పవర్... నో ఫికర్
మార్కెట్లో విద్యుత్ ఆదా ఉపకరణాలు 25-40 శాతం ఇంధన పొదుపు
ప్రతి నెలా అధిక కరెంటు బిల్లుతో విసిగిపోతున్నారా? ఏసీ, కూలర్, వాషింగ్ మెషీన్, మోటార్ తదితర గృహోపకరణాల్ని అవసరం మేరకు వినియోగించుకునేందుకు భయపడుతున్నారా? ప్రధాన ఇంధన వనరైన విద్యుత్‌ను భావితరాల వారికి మిగల్చాలనుకుంటున్నారా? అయితే వీటన్నింటికీ పరిష్కార మార్గాలు ఒక్కొక్కటిగా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రతి నెలా విద్యుత్ బిల్లులో 25 శాతం నుంచి 40 శాతం వరకు కచ్చితమైన ఆదా చేసే ఉపకరణాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా
పవర్ సేవర్లపై ప్రత్యేక కథనం...
విశాఖ రూరల్ : విద్యుత్‌ను ఆదా చేయాలన్న స్పృహ సర్వత్రా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని కొన్ని పరిశ్రమలు విద్యుత్‌ను ఆదా చేసే పరికరాలను తయారు చే స్తున్నాయి. సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాలు వైండింగ్‌తో కూడి ఉంటాయి. వైండింగ్ తయారీలో తలెత్తే స్వల్ప లోపాలు, కొన్నేళ్ల వాడకం తర్వాత ఏర్పడే లీకేజీల వల్ల ఆ పరికరాలు వాటి వాస్తవ సామర్థ్యం కంటే ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటాయి. ముఖ్యంగా ఇంట్లో కరెంటుకు సంబంధించి పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ తగిన మోతాదులో లేకపోవడమే ఇందుకు కారణం. గృహాలకు సరఫరా అయ్యే విద్యుత్ వోల్టేజ్లో హెచ్చుతగ్గులు సర్వసాధారణం. పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ ఇంటికి జరిగే విద్యుత్ సరఫరాలో సరైన స్థాయిలో లేనందువల్ల హై వోల్టేజ్ వచ్చేటపుడు సాధారణంగా గృహోపకరణాలు వాటికి కావాల్సిన కరెంటు కంటే ఎక్కువ వాడుకొని వేడెక్కుతాయి. దీంతో వాటి లైఫ్ టైం తగ్గి ముందుగానే కాలిపోవడం(రిపేరుకు రావడం) జరుగుతుంది.
సమాచార సాంకేతిక శాఖ సర్టిఫికేషన్‌తోనే...
విద్యుత్‌ను ఆదా చేసే ఉపకరణాలు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కొన్ని సంస్థలు ఈ తరహా పవర్ సేవర్ పరికరాలను తయారు చేస్తున్నాయి. ఈ పరికరాలకు కేంద్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక (డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ టెస్ట్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఈటీడీసీ) నుంచి స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్టీక్యూసీ) ఇస్తున్నారు. ఈడీటీసీ వారి యూనివర్సల్ పవర్ ఎనలైజర్ (మోడల్ నెం. పిఎం.3000ఎ వోల్టెక్) పరీక్షలో 40 శాతం విద్యుత్ ఆదా అవుతున్నట్టు నిరూపితమైంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్ ఆదా ఉపకరణాల్లో ఎస్.వి.ఎన్. పవర్ సేవర్ ఒకటి. ఇంకా మరికొన్ని కంపెనీలు పవర్ సేవర్లను అందిస్తున్నాయి. 15 ఏళ్ల లైఫ్ టైం.. మూడేళ్ల గ్యారంటీతో, లైఫ్‌టైం ప్రీ మెయింటెనెన్స్‌తో లభించే ఈ పరికరాలను ఉపయోగించడం చాలా సులభం. ఇంట్లో ఏదో ఒక త్రీ పిన్ ప్లగ్ సాకెట్లో సెల్ చార్జర్/మస్కిటో రీఫిల్ మెషీన్ మాదిరి ఫిక్స్ చేస్తే సరిపోతుంది. వీటి సాయంతో ప్రతి నెలా విద్యుత్ బిల్లులో 25 శాతం నుంచి 40 శాతం వరకు కచ్చితమైన ఆదా ఉంటుందని తయారీ సంస్థలు చెబుతున్నాయి.
వీటిని నిశ్చింతగా వాడుకోండి...
ఇళ్లల్లో ఉపయోగించే ఏసీ, కూలర్, ఫ్రిజ్, వాషింగ్‌మెషీన్, టీవీ, గ్రైండర్, మిక్సీ, వాక్యూమ్ క్లీనర్, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితర ఇండక్టివ్ వస్తువులు, వెల్డింగ్మెషీన్, డ్రిల్లింగ్ మెషీన్, అన్ని రకాల మోటర్ పంపులు, లిఫ్ట్, ఎస్కలేటర్, లేత్ మెషీన్, సా మిల్లు, జెరాక్స్ మెషీన్, అన్ని రకాల సబ్మెర్సిబుల్ మోటర్లు తదితర వైండింగ్ వస్తువుల్లో వృధా అయ్యే కరెంటును పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ టెక్నాలజీతో పవర్ సేవర్ ఆదా చేస్తుంది. దీంతో ప్రతి నెలా వచ్చే అధిక కరెంటు బిల్లు తగ్గుతుంది. ఇంటి మొత్తానికి ఒక మాస్టర్ స్టెబిలైజర్‌గా పనిచేస్తుంది. గృహోపకరణాల జీవిత కాలాన్ని పెంచుతుంది. ఇవి ప్రస్తుతం మార్కెట్లో రూ.2 వేలు నుంచి రూ.2500 మధ్య దొరుకుతున్నాయి.
ఇలా ఉపయోగించాలి...
సింగిల్ ఫేజ్/సర్వీస్‌కు ఈ డివైస్‌ను ఇంట్లో ఎక్కడైనా త్రీ పిన్ సాకెట్(ప్లగ్)కు అమర్చితే సరిపోతుంది. ఈ డివైస్‌ను తప్పనిసరిగా ఎప్పుడూ ఆన్ చేసే ఉంచాలి. త్రీ ఫేజ్/సర్వీసుకు ఒక్కొక్క ఫేజ్‌కు ఒక్కొక్కటి చొప్పున మూడు వాడాలి. ఈ డివైస్‌లను మీటర్ వద్దనున్న ఎంసీబీ బోర్డు తర్వాత మూడు సాకెట్లు ఏర్పాటు చేసుకుని అమర్చాలి.మైక్రో ఓవెన్, ఐరన్‌బాక్స్, బకెట్ హీటర్, గీజర్, ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్, ఎలక్ట్రానిక్ చపాతీ మేకర్, ఫిలమెంట్ బల్బుల వినియోగంలో మాత్రం ఈ పవర్ సేవర్లు విద్యుత్‌ను ఆదా చేయవు. ఈ వస్తువులు ఇండక్టివ్(వైండింగ్) వస్తువులు కాకపోవడంతో ఈ సేవర్లు ద్వారా విద్యుత్ ఆదా అయ్యే అవకాశం లేదు.