హైటెన్షన్’ బాధిత రైతులకోసం ప్రత్యేక చట్టం
కోదండరాం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో బాధిత రైతుల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమా వేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములు కోల్పో యిన రైతుల కోసం తెచ్చిన చట్టం మాదిరిగా విద్యుత్ లైన్ల కోసం భూములు కోల్పోయిన వారికోసం కొత్తగా చట్టాన్ని తీసుకురావాలన్నారు.
ప్రస్తుతం నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 400 కేవీ, 765 కేవీ లైన్ల కోసం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివల్ల రైతులు పెద్ద మొత్తంలో భూములు కోల్పోతున్నారని అన్నారు. కానీ ఆయా సంస్థలు అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయన్నారు. చట్టప్రకారం పరిహారం పంపిణీపై సంబంధిత జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ... వాటిని అమలు చేయలేదన్నారు. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పరిహారం కావాలని ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు పక్షం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, కానీ నెలలు గడుస్తున్నా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ఇదిలా ఉండగా బాధిత రైతులు సర్పంచ్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆందోల్ కృష్ణ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఉద్యమ కమిటీలు ఏర్పాటు చేశారు.