అరెరే... పై నుంచి కింద పడ్డారా!
స్వప్నలిపి
దిగ్గున... నిద్రలో నుంచి లేచి కూర్చుంటాం. నుదుటికి పట్టిన చెమటలు ‘కల’ తీవ్రతను తెలియజేస్తాయి. ‘‘హమ్మయ్య...నాకు ఏమీ కాలేదు’’ అనుకోవడం కంటే ఆ కలనే ఎక్కువగా గుర్తు చేసుకుంటాం. డాబా మీది నుంచో, కొండ మీది నుంచో లేదా ఎత్తై ప్రదేశం నుంచో జారి కిందపడడం అనేది చాలా ఎక్కువమందికి వచ్చే కల.
ఈ కలకు సంబంధించిన కొన్ని వివరణలు తెలుసుకుందాం: జీవితం అనేది మనదే అయినప్పటికీ అది కొన్నిసార్లు మన చేతుల్లో ఉండదు. చేజారిపోతున్న జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నా... ఫలించే ఆశ ఏదీ కనిపించదు. ఇలాంటి పరిస్థితులలో నిరాశానిస్పృహలు చుట్టుముడతాయి. ఈ స్థితిని ప్రతిబించించేదే... చాలా ఎత్తు నుంచి పడి పోతున్నట్లుగా వచ్చే కల.వెనక నుంచి ఎవరో తోస్తే కిందపడిపోయినట్లు కల వస్తుంటుంది కొన్నిసార్లు.
నమ్మినవాళ్లు, ఆత్మీయులు అనుకున్నవాళ్ల ఉన్నట్టుండి మోసం చేయడాన్ని లేదా ఇబ్బందులకు గురి చేయడాన్ని ఈ కల ప్రతిబింబిస్తుంది.కొండ చివర వేలాడుతూ, ఏ క్షణాన కింద పడతామో తెలియని భయంలో కొట్టుమిట్టాడుతున్నట్లు కల రావడం అనేది, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం... ఏదైనా కావచ్చు పరిస్థితుల మీద పట్టు తప్పిన విషయాన్ని సూచిస్తుంది.
కష్టకాలంలో ఆత్మవిశ్వాసం లోపించడం, వ్యక్తిగత సంబంధాల్లో పెను మార్పులు రావడాన్ని సూచిస్తుంది. మీతో పాటు ఎవరైనా కింద పడినట్లు కల వస్తే... ఇద్దరూ ఒకేలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారని అర్థం. జీవితంలో వివిధ సందర్భాల్లో కొన్ని ప్రమాద సంకేతాలు అందుతుంటాయి. జాగ్రత్త పడడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడడం అనేది ఒక విధానం. అలా కాకుండా... ప్రమాదం పొంచి ఉందని తెలిసినా ఏం చేయాలో తోచని గందరగోళస్థితిలో కూడా చాలా ఎత్తు నుంచి కిందపడబోతున్నట్లు కలలు వస్తుంటాయి.