‘నాలుగులైన్లు’.. కలేనా ?
జడ్చర్ల : నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే జడ్చర్ల- నల్గొండ అంతర్రాష్ట్ర రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. ప్రతిపాదనలకే పరిమితమై నాలుగు లైన్ల పనులు ముందుకుసాగడం లేదు. గతేడాది రాష్ట్రంలో ఐదు రహదారులకు జాతీయహోదాకల్పించాలని పభుత్వం భావించిన నేపథ్యంలో ఈ రహదారిని కూడా జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌ల స్థితిగతులపై హైదరాబాద్‌లో గత ఏడాది జరిగిన సమీక్ష సమావేశంలో అప్పటి కేంద్రమంత్రి ఆస్కార్ ఫెర్నాండేజ్ ఆమోదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు రహదారలకు జాతీయ రహదారుల స్థాయి కల్పించడానికి నిధులు విడుదల చేసేందుకు ఆమోదంకూడా తెలిపారు. దీంతో కోదాడ- మిర్యాలగూడ- దేవరకొండ- కల్వకుర్తి- జడ్చర అంతర్రాష్ట్రరహదారిని నాలుగులైన్లుగా మారనున్నట్లు ప్రచారం జరిగింది. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహ బూబ్‌నగర్ న ల్గొండ మధ్య 163 కి.మీల రహదారిని విస్తరించాలన్న ప్రతిపాదనలు ఉన్నాముందుకు సాగలేదు.
ముసాయిదా బిల్లులోనూ...
తెలంగాణకు రహదారుల సౌకర్యాన్ని మెరుగపర్చాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోను ప్రస్తావించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రహదారుల సౌకర్యాలకు అనువుగా తీర్చిదిద్దే బాధ్యతను నేషనల్ హేవేస్ అథారిటీ ఆఫ ఇండియాకి అప్పగించే విధంగా చర్యలు తీసుకొనున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కోదాడ నుండి మిర్యాలగూడ, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల వరకు సుమారు 220 కి.మీల మేర రోడ్డును జాతీయరహదారి స్థాయికి పెంచాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్అండ్బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
విస్తరిస్తే ప్రయోజనమిదే..
అయితే ఈ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తే కర్ణాటక ప్రాంతవాసులు కోస్తా జిల్లాలకు వెళ్లేందుకు దాదాపుగా వంద కిమీలకు పైగా దూరం తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కల్వకుర్తి, దేవరకొండ మీదుగా నల్గొండ జిల్లాలోని మాచర్ల వద్ద జాతీయ రహదారిని చేరుకునే అవకాశం ఉంది. కర్ణాటక, గోవా తదితర ప్రాంతాల నుండి ఉత్తర భారతం వైపునకు దారిగుండా వెళ్తారు. ముఖ్యంగా జిల్లా రైతులు, వ్యాపారులు ఈ రోడ్డుమార్గం ద్వారా మిర్చి, పత్తి వంటి పంట ఉత్పత్తులను గుంటూరు తదితర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అయితే ప్రస్తుతం కొంత మేర సింగల్, మరికొంత మేర డబుల్ రోడ్డుగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రహదారి ఇరుకుగా ఉండడటంతో ప్రమాదాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ రోడ్డును నాలుగులైన్ల రహదారిగా మార్చాలని పలువురు కోరుతున్నారు.