కోత ముమ్మరం
- నాలుగు చక్రాల వాహనం ఉంటే రేషన్ కట్
- తాజాగా ఇంటి పన్ను చెల్లిస్తున్న వారి కార్డుల తొలగింపు
– ఆందోళనలో రేషన్ కార్డుదారులు
అనంతపురం అర్బన్ : దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు ఇచ్చిన రేషన్ కార్డుల కోతను ప్రభుత్వం ముమ్మరం చేసింది. ప్రజాసాధికార సర్వేకు సమాచారం ఇవ్వడం వల్ల సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల కోత ఉండదన్న ప్రభుత్వం ప్రకటనలు అబద్ధమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు చక్రాల వాహనం ఉందంటూ ఇప్పటికే కార్డులు తొలగించిన ప్రభుత్వం... తాజాగా మరో చర్యకు ఉపక్రమించింది. ఇంటి పన్ను చెల్లిస్తున్నారంటూ కార్డుల కోత పెడుతోంది. మునుముందు ఇంకేమి మెలికలు పెట్టి కార్డులు కోత వేస్తారోనని పేదలు ఆందోళనకు గురవుతున్నారు.
సాధికార సర్వే ఎఫెక్ట్
ప్రజా సాధికార సర్వే పేరుతో దాదాపు 22 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించి ఆధార్‌కు అనుసంధానం చేసింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పేదలపై పడింది. ఇందులోని సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల తొలగింపు చేపట్టింది. కొందరు పేదలు స్వయం ఉపాధి కోసం బ్యాంకులో రుణం తీసుకుని నాలుగు చక్రాల వాహనం (జీపు) కొనుగోలు చేశారు. దాన్ని బాడుగకు నడుపుతూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
నాలుగు చక్రాల వాహనం ఉందనే కారణంగా ఇప్పటికే పలువురికి రేషన్ కార్డులు తొలగించారు. వార్షిక ఆదాయం రూ.65 వేలకు మించి ఉందంటూ కొందరికి ఇచ్చిన కార్డులను తొలగించారు. ఇంటి పన్ను చెల్లిస్తున్నారంటూ తాజాగా కార్డుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. పట్టణాల్లో ఇంటి పన్ను రూ.500 లోపు చెల్లిస్తున్న తెల్లకార్డుదారులకు రూ.200 కొళాయి కనెక్షన్ ఇస్తున్నారు. అంటే రూ.500 లోపు పన్ను చెల్లించేవారు తెల్లకార్డుకు అర్హులనేది స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు రూ.305 ఇంటి పన్ను చెల్లిస్తున్న వారికీ రేషన్ కార్డు తొలగించడం చూస్తే సొంత ఇల్లు ఉంటే కార్డు తొలగిస్తారనేది స్పష్టమవుతోంది.