ఐదు కళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ నో
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని 5 మెడికల్ కళాశాలల్లో 2016-17 సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) కోర్సుల సీట్ల పెంపు ప్రతిపాదనలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా( ఎంసీఐ) తిరస్కరించింది. జాబితాలో తెలంగాణ నుంచి ఉస్మానియా(హైదరాబాద్), కాకతీయ(వరంగల్), మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఘనపూర్, రంగారెడ్డి), ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(తిరుపతి), రంగరాయ మెడికల్ కళాశాల(కాకినాడ)లు ఉన్నాయి. ఈ కళాశాలల్లో బోధన సిబ్బంది, సౌకర్యాలు తదితర వాటిపై తాను నియమించిన కౌన్సిల్ సభ్యులు అందించిన నివేదిక ఆధారంగా సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి నిరాకరించింది.
శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, రంగరాయ, కాకతీయ మెడికల్ కళాశాలల్లో ఎంఎస్(జనరల్ సర్జరీ), ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంఎస్(ఆర్థోపెడిక్స్), మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ కళాశాలలో ఎంఎస్(ఓబీజీ-అబ్స్ట్రెటిక్ అండ్ గైనకాలజీ), ఎండీ(పీడియాట్రిక్స్) కోర్సుల్లో సీట్ల పెంపునకు ఎంసీఐకి ప్రతిపాదనలు అందాయి. సీట్ల పెంపును కోరుతూ ఆయా విద్యాసంస్థలు తమ కళాశాలల్లో అందిస్తున్న బోధన, సౌకర్యాల కల్పనపై నివేదికలను పరిశీలించిన ఎంసీఐ వీటిపై తనిఖీకి కమిటీని నియమించింది.
ఈ కమిటీ సభ్యులు ఆ కళాశాలల్లో తనిఖీ చేసి తగినంత మంది బోధన సిబ్బంది, సౌకర్యాలు లేవని తేలింది. సాంకేతిక లోపాలూ ఉన్నట్లు సభ్యులు గమనించారు. ఈ మేరకు ఎంసీఐకి పూర్తి వివరాలతో నివేదిక పంపారు. వీటిని పరిశీలించి సీట్ల పెంపును ఎంసీఐ నిరాకరించింది. పూర్తి వివరాలను శనివారం కమిటీ వెల్లడించింది.
కారణాలీవీ...
* శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో సాంకేతికపరమైన లోపాలతో పాటు అసలు ఈ సంస్థలో నిర్వహిస్తు న్న అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుకు ఇంకా గుర్తింపు లభించలేదని, యూజీ కోర్సుకు గుర్తింపు లభించేవరకూ పీజీ కోర్సు కోసం దరఖాస్తు చేసే అర్హత లేదని ఎంసీఐ స్పష్టం చేసింది.
* కాకతీయ మెడికల్ కళాశాలలో తనిఖీ నిర్వహించినరోజు బెడ్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉందని, ప్రధాన వార్డ్ బయట వరండాలో బెడ్లు వేశారని, బోధనా సిబ్బంది తక్కువగా ఉన్నారని, లైబ్రరీ సౌకర్యాలు సరిపోవని కమిటీ గుర్తించింది.
* మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో 2015లో జరిగిన మేజర్, మైనర్ ఆపరేషన్లపై కళాశాల అందించిన గణాంకాలు సరిగా లేవని, తనిఖీ జరిగిన రోజు బెడ్ ఆక్యుపెన్సీ, స్పెషాలిటీ క్లినిక్‌లో హాజరు తక్కువగా ఉందని కమిటీ గమనించింది. పీడియాట్రిక్స్ వార్డ్‌లో ఉదయం కేవలం 24 మంది పేషెంట్లు ఉండగా, సాయంత్రానికి 65 మంది ఉన్నట్లు గుర్తించింది. ఒకేసారి పేషెంట్ల సంఖ్య ఒకటిన్నర రెట్లు పెరగడం సాధ్యం కాదని, పైగా కొత్తగా చేరిన పేషెంట్లను పరిశీలిస్తే వారికీ ఏ విధమైన వైద్య సమస్యలు లేనివారిలా ఉన్నారని కమిటీ నిర్ధారించింది.
* ఉస్మానియా, రంగరాయ మెడికల్ కళాశాలల్లో ఫాకల్టీ సంఖ్య తక్కువ, ఇతర లోపాల కారణంగా సీట్ల పెంపుప్రతిపాదనలను తిప్పిపంపాలని ఎంసీఐ నిర్ణయించింది.