ఇషా తల్వార్‌కు మరో చాన్స్
తన అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి నటి ఇషా తల్వార్‌కు మరో అవకాశం తలుపుతట్టింది. ఈ ఉత్తరాది భామ ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్‌హిట్ చిత్రం తిల్లు ముల్లు రీమేక్‌లో నటించింది. మిర్చి శివ హీరోగా నటించిన ఆ చిత్రం అమ్మడికి ఎలాంటి హెల్ప్ అవ్వలేదు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమపై కన్నేసింది.అయితే అక్కడ ఇషాతల్వార్ క్లిక్ అయ్యింది. మలయాళంలో తను నటించిన తట్టత్తిన్ మరైయత్తు అనే చిత్రం మంచి విజయాన్ని సాధించింది.అంతే కాదు ఆ చిత్రం ఈ భామకు మరోసారి తమిళంలో నటించే అవకాశాన్ని కల్పించింది.
అవును మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన తట్టత్తిన్ మరైయత్తు చిత్రం ఇప్పుడు తమిళంలో పునర్నిర్మాణం అవుతోంది. ఇందులో హీరోయిన్గా ఇషా తల్వార్నే నటిస్తోంది. హీరోగా నవ నటుడు వాల్టర్ ఫిలిప్స్ పరిచయం అవుతున్నారు. దీన్ని ఎస్వీడీ పతాకంపై జయచంద్రన్ నిర్మిస్తున్నారు. జవహర్ ఆర్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇందులో ఆయన బాణీలు కట్టిన మైపొట్టు మైపొట్టు అనే పాట ఏప్రిల్ ఒకటో తేదీన యూ ట్యూట్లో విడుదలై హల్చల్ చేస్తోంది. ఇది వివాహ తంతు నేపథ్యంలో సాగే పాట అని చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని కలైపులి ఇంటర్నేషనల్ సంస్థ విడుదల హక్కుల్ని పొందినట్లు తెలిపారు. మలయాళంలో తనకు అడ్రస్ నిచ్చిన ఈ చిత్రం తమిళంలోనూ మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఇషా తల్వార్ ఉందట. మరి ఈ జానకలల్ని ఈ చిత్రం ఎంత వరకు నిజం చేస్తుందో వేచి చూడాల్సిందే.