సోనియాపై ఆరోపణలు.. కంగనాకు కాంగ్రెస్ వార్నింగ్
హిమాచల్ ప్రభుత్వం, సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. విపత్తు సాయం కోసం ఉద్ధేశించిన నిధులను హిమాచల్ ప్రభుత్వం.. వాటిని సోనియా గాంధీకి అక్రమంగా బదిలీ చేసినట్లు కంగన చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరింది. లేని పక్షంలో ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. కంగనా రనౌత్ తన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ‘కంగన తన ప్రకటనను ఉపసంహరించుకోకపోతే.. మేం పరువు నష్టం దావా వేస్తాం. ఆమె ఆధారాలతో అలాంటి ప్రకటన చేసింది? సోనియా గాంధీ లాంటి నాయకురాలిపై ఆమె అలాంటి ప్రకటన చేయడం చాలా దురదృష్టకరం.కేంద్రం నుంచి వచ్చే నిధులు లేదా రాష్ట్ర అభివృద్ధికి కేటాయించిన నిధులు సోనియా గాంధీకి ఇస్తున్నారని చెప్పడం కంటే పెద్ద మూర్ఖపు ప్రకటన మరొకటి ఉండదు. ఒక్క రూపాయి అయినా దారి మళ్లినట్లు రుజువు చేయాలి. లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఆమెపై కాంగ్రెస్ పరువునష్టం కేసు పెడుతుంది’ అని తెలిపారు.కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖజానాను ఖాళీ చేశాయన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరి సోనియా గాంధీకి నిధులు బదిలీ చేసినట్లు ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడిందని అన్నారు. ‘కేంద్రం విపత్తు నిధులు ఇస్తే, అది సీఎం రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది. అయితే హిమాచల్‌లో సోనియా రిలీఫ్ ఫండ్‌కు వెళుతుంది’ అని మనాలిలో ఆదివారం జరిగిన బీజేపీ కార్యక్రమంలో పేర్కొన్నారు.