టీటీడీ ప్రాజెక్టులన్నీ హెచ్‌డీపీపీలోకి విలీనం
తిరుపతి ఎడ్యుకేషన్: టీటీడీలోని అన్ని ప్రాజెక్టులను హిందూ ధర్మప్రచార పరిషత్ (హెచ్డీపీపీ)లోకి విలీనం చేయనున్నట్లు టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ధర్మ ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో మంగళవారం ఆయన సీనియర్ అధికారులతో సమీక్షించారు. టీటీడీలోని హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టులు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వీటిని హెచ్‌డీపీపీలో విలీనం చేసి పరిశోధన, కార్యక్రమాల రూపకల్పన, ముద్రణ, ప్రచారం వంటి ఉప విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సప్తగిరి మాసపత్రిక పాత సంచికలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. టీటీడీకి అవసరమైన అన్ని రకాల మందుల కొనుగోలుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించాలని సూచించారు. టీటీడీ ఉద్యోగుల్లో నైపుణ్యం పెంచేందుకు అనుగుణంగా కొత్తగా విధుల్లో చేరే ఉద్యోగులకు రెండు నెలల పాటు శిక్షణను తప్పనిసరి చేయాలని, క్యాడర్ వారీగా శిక్షణ మాడ్యూళ్లను తయారు చేయాలని ఆదేశించారు. కాల్ సెంటర్లో కాలర్ ఏజెంట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. సేవల విభాగాన్ని హెచ్ఆర్ విభాగంగా పిలవాలని, ఇక్కడ చేపట్టాలి్సన విధులకు సంబంధించి జేఈవో, డీఈవో, డిప్యూటీ ఈవో (సేవలు)లతో కమిటీని వేశారు.