చిరస్మరణీయులారా! వందనాలు!!
దళితుల పట్ల హిందూ సమాజం శత్రు, విద్వేష పూరిత వైఖరిని ప్రద ర్శిస్తున్నా... అంటరాని కులాల అభ్యున్నతికి ఎంతో కొంత మేలు చేసినవారు, ఎనలేని కృషి చేసినవారు కూడా అదే సమాజం నుంచి ఆవిర్భవించారు. ఆధిపత్య భావజాలాన్ని వదిలిపెట్టి, సాంఘిక సమానత్వం, దిశగా వేసిన తొలి అడుగులుగా నేను వారి కృషిని భావిస్తాను. వర్ణ సమాజపు ‘‘ఇనుప కంచె’’ను అంగుళమైనా కద ల్చడానికి వారి కృషి తోడ్పడిందని నమ్ముతాను. అటువంటి వారినందరినీ గుర్తు చేసుకోవాల్సిన ఒక సందర్భం అవసరం. అలాంటి సందర్భమే జూలై 20.
‘‘అంటరాని కులాలకు, వర్ణ సమాజానికీ మధ్య ఇనుప కంచె ఉంది. అది తొలగించరానంత బలమైనది’’ అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు. భారత సామాజిక నిర్మాణంలో వర్ణం, అవర్ణం అనే రెండు విభాగాలున్నాయి. వర్ణంలో ద్విజులు, ద్విజులు కానివారు అనే తేడాలున్నాయి. ద్విజులలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, ద్విజులుకాని వారిలో శూద్రులు ఉన్నారు. ద్విజులలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల మధ్య కూడా వ్యత్యాసం, వైరుధ్యాలున్నాయి. వారి మధ్య ఘర్ష ణలు జరిగినట్టు సైతం చారిత్రక ఆధారాలున్నాయి. అయితే అవసరమైనప్పుడు కలసిపోయే స్వభావం కూడా వారికి ఉన్నది. కానీ వర్ణ సమాజానికీ, అవర్ణులకు మధ్య ఉన్నది అగాధం. అవర్ణులను ఆదిమ తెగలు, మైదాన తెగలు, అంటరాని కులా లుగా వర్గీకరించారు అని ఆయన ఆ అంశాన్ని వివరించారు. ‘‘అయితే ఆదిమ తెగలు, మైదాన తెగలతో వర్ణ సమాజానికి తీవ్ర విభేదం ఉన్నది.
కానీ శత్రు వైఖరి లేదు. అయితే అంటరాని కులాలకు, వర్ణ సమాజా నికీ మధ్య ఇనుప కంచె ఉంది’ అంటూ అంబేడ్కర్ మొత్తంగా వర్ణ వ్యవస్థ స్వరూప, స్వభావాలను ఆవిష్కరించారు.‘‘జపాన్ను సందర్శించిన ప్రతి అమెరికా అధ్యక్షుడు హిరోషిమా, నాగసాకీలకు వెళ్లి, రెండవ ప్రపంచ యుద్ధం నాటి తమ అణు మారణహోమం పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తారు. అలాగే, అమృత్సర్ వెళ్లిన ప్రతి భారత ప్రధాని ‘బ్లూస్టార్ ఆపరేషన్ ’ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తారు. కానీ రెండు వేల ఏళ్లకు పైగా అంటరాని కులాల మీద అకారణంగా జరుగుతున్న మారణకాండ, అమానుషాల పట్ల హిందూ సమా జం కానీ, సంస్థలు కానీ కనీసం పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. ఇది పూర్తిగా అమానవీయ ప్రవర్తన’’ అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్ ఇటీవల అన్నారు.
‘‘ఇనుప కంచె’’ను కదిల్చిన వారెందరో
ఈ రెండు వ్యాఖ్యలు హిందూ సమాజం అంటరాని కులాలుగా చూస్తున్న దళి తుల పట్ల అనుసరిస్తున్న శత్రు, విద్వేష పూరిత వైఖరికి అద్దం పడుతున్నాయి. అయితే అంటరాని కులాల అభ్యున్నతికి ఎంతో కొంత మేలు చేసినవారు, ఎనలేని కృషి చేసినవారు కూడా హిందూ సమాజంలోనే ఉన్నారు. హిందూ సమాజ ఆధిపత్య భావజాలాన్ని వదిలిపెట్టి, సమాజ శ్రేయస్సు కోసం వేసిన తొలి అడుగులుగా నేను వారి కృషిని భావిస్తాను. వర్ణ సమాజపు‘‘ఇనుప కంచె’’ను అంగుళమైనా కదిలించే దిశగా వారు ప్రయత్నం చేశారని నమ్ము తాను. అటువంటి వారినందరినీ గుర్తుచేసుకోవాల్సిన ఒక సందర్భం అవస రం. అలాంటి సముచిత సందర్భమే జూలై 20. అది భారత చరిత్ర కొత్త మలుపు తిరిగిన సమయం. 1913, జూలై 20న భీమ్రావు రామ్‌జీ అంబేడ్కర్ అనే 24 ఏళ్ల దళిత యువకుడు, మొట్టమొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. బరోడా సంస్థానాధీశుడు శాయా జీరావు గైక్వాడ్ అందజేసిన ఉపకారవేతనం వల్లనే ఆయనకు ఈ అవకాశం లభించింది.
ఆ తదుపరి కొల్లాపూర్ సంస్థానాధీశుడు సాహూ మహారాజ్ సహాయంతో లండన్‌లో న్యాయ, ఆర్థిక శాస్త్రాల అధ్యయనం, పరిశోధన చేశారు. ఒక పరిణతి చెందిన మేధావిగా, కార్యశీలిగా ఆ తర్వాత ఆయన అంటరాని కులాల కోసం సాగించిన నిరంతర పోరు, అధ్యయనం, సాధిం చిన విజయాలు అందరికీ తెలిసినవే. అందుకే జూలై 20వ తేదీ దళిత శ్రేయోభి లాషులకు అంకితం ఇవ్వాల్సిన సరైన సందర్భం. వారిరువురే కాదు, తమ తమ స్థాయిల్లో దళితుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేసిన దళితేతరు లందరి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం సముచితం. వారు తమ చుట్టూ ఉన్న వర్ణ సమాజాన్ని ధిక్కరించి నిలబడటం తేలికేం కాదు. అం దుకే అటువంటి వారందరికీ దళితజాతి యావత్తూ అభినందనలను తెల పడం అవసరం. దళిత సమున్నతి కోసం జరిగిన ఈ కృషి చరిత్రలో నేనెరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను మీ ముందుంచుతాను.
చాపకూటి నుంచి దళిత విద్య వరకు
చాపకూడుతో పలనాట కుల విభేదాలకు స్వస్తి పలకాలని చూసిన బ్రహ్మనా యుడు, మాల కన్నమదాసును తన సైన్యానికి అధిపతిని చేయడం చిరస్మరణీ యం. ఆ కారణంగా వర్ణ ధర్మాన్ని మంటకలిపిన భ్రష్టునిగా ఆయన ముద్ర వేయించుకోవడమే కాదు, తాను నమ్మిన దాని కోసం కన్న కొడుకులను సైతం యుద్ధంలో కోల్పోయాడు. ఇక ఆధునిక చరిత్రలో అంబేడ్కర్ తన గురువుగా ప్రకటించుకొన్న మహాత్మా జ్యోతిరావ్ ఫూలేకు, ఆయన సహచరి సావిత్రిబాయి ఫూలేలను సంస్మరించాల్సి ఉంటుంది. దాదాపు 150 ఏళ్ల క్రితమే అంటరాని కులాల బాలికల కోసం పాఠశాలను నడిపి, హిందూ సమాజం విద్వేషంతో విసిరిన రాళ్ల దెబ్బలను వారు చవిచూశారు. అలాగే 1880లో తెలుగు నేలపై కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకట రత్నం నాయుడు లాంటి వారు ఆనాటి పిఠాపురం రాజా మహిపతి సూర్యా రావు సాయంతో దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలను నడిపారు. సుప్రసి ద్ధులైన ఎందరో దళిత మేధావులు, నాయకులు ఈ పాఠశాలల్లో చదివిన వారే. శ్రీకాకుళం జిల్లాలో గరిమెళ్ల సీతారాం కూడా ఇలాగే ప్రత్యేక పాఠశాల లను నిర్వహించారు.
మచిలీపట్నంలో వేమూరి రాంజీరావు పంతులు తన ఆస్తినంతా తెగనమ్మి దళిత విద్యార్థుల కోసం కళాశాలను, హాస్టల్‌ను నిర్వ హించారు. ఆయన సహకారంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన కాకి మాధవరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు రామక్రిష్ణయ్య, నిరం జన్రావులు కాలేజీ చదువులు చదవగలిగారు. కొనసాగించగలిగారు. నెల్లూరు జిల్లాలో ఏనుగు పట్టాభిరాంరెడ్డి, నేదురుమల్లి బాలక్రిష్ణారెడ్డి, గుం టూరు జిల్లాలో నల్లపాటి హనుమంతరావు, గూడూరు రామచంద్రుడు లాంటి వారు తమ సొంత డబ్బులతో దళిత కులాల విద్యార్థుల కోసం పాఠశాలలను, హాస్టల్స్‌ను నిర్వహించారు.
దొడ్ల రామచంద్రారెడ్డి (డీఆర్) చొరవతో ఏర్పరచిన కావలిలోని జవ హర్ భారతి కళాశాలకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే విశిష్టమైన స్థానం ఉంది. నేటికీ నడుస్తున్న ఆ కళాశాల వేలాదిగా దళిత విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా తీర్చిదిద్దింది. జవహర్ భారతిలోనే చదివి, ఆ హాస్టల్ అన్నమే తిని, అక్కడే లెక్చరర్‌గా పని చేస్తున్న పోతురాజు నేడు అదే కళాశాలకు ప్రిన్సిపల్‌గా ఎదిగారంటే అది డీఆర్ కృషి ఫలితమే. పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మాల్యాద్రి కూడా అదే కళాశాల విద్యార్థి. మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డితో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణిం చిన పి. సుబ్రహ్మణ్యం అదే పీజీ కళాశాల విద్యార్థి.
హైదరాబాద్ సంస్థానంలో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి బాల ముకుందరాయ్ ఆర్థిక సహాయంతో భాగ్యరెడ్డి వర్మ అంట రాని కులాల పిల్లల కోసం పలు పాఠశాలలను స్థాపించారు. మర ణానంతరం తన అంత్యక్రియలను సైతం ‘ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్’ మాత్రమే నిర్వహించాలని వీలునామా రాసిన విశిష్ట చరితుడాయన. తెలంగాణ కమ్యూనిస్టు యోధుడు రావి నారా యణరెడ్డి, స్వాతంత్య్రోద్యమ నాయకురాలు సంగం లక్ష్మీబాయి లాంటి వారు దళితుల కోసం ప్రత్యేక హాస్టల్స్ నిర్వహించారు.
దళితులు, పేదల పట్ల నిబద్ధులైన అధికారులు
ఇక స్వాతంత్య్రానంతర కాలంలో ప్రభుత్వాధికారులుగా పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, పి.ఎస్. కృష్ణన్, కె.ఆర్. వేణుగోపాల్ లాంటి వారు, తమ సామా జిక గుర్తింపును, కులాన్ని పక్కన పెట్టి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. శంకరన్ గారిది దళిత అభ్యున్నతి చరిత్రలోనే విశిష్ట పాత్ర. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఆయన దేశానికే మార్గ నిర్దేశన చేసిన వారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా, 1976లో హైదరాబాద్‌లో జరిగిన ‘హరిజన కాన్ఫరెన్స్’ ఆమోదించిన సిఫారసులకు అనుగుణంగా ఒకే ఏడాది దాదాపు 120 జీవోలను విడుదల చేసి ఐఏఎస్ అధికారిగా రికార్డు సృష్టించారు. దళితులు, ఆదివాసులకు విద్య అందాలంటే హాస్టల్స్ అవసరమని నొక్కి చెప్పి, ఆయన తన హయాంలోనే ఆ వ్యవస్థను పటిష్టపరచడం కోసం అధికారులను పరు గులు తీయించారు. నిబద్ధతకు, కార్యశీలతకు నిర్వచనం శంకరన్. నేడు ప్రముఖంగా వినవచ్చే ‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్’ రూపకర్తల్లో ముఖ్యులు పి.ఎస్.కృష్ణన్. రిటైర్మెంట్ తరువాత నేటికీ ఆయన తన మేధను, శ క్తియుక్తు లను ఎస్సీ, ఎస్టీలు, బీసీల అభివృద్ధికే వెచ్చిస్తుండటం ఎంతైనా అభినంద నీయం.
అదేవిధంగా కె.ఆర్. వేణుగోపాల్ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేస్తుం డగా దళితులకు, పెత్తందార్లకు మధ్య తలెత్తిన భూ వివాదంలో దళితుల పక్షాన నిలిచి పోరాడిన వ్యక్తి. కోర్టు కేసులను సైతం ఎదుర్కొన్న అరుదైన అధికారి. పేద పిల్లల కడుపునింపడం కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న ఏకైక ప్రభుత్వ కార్యక్రమం ఐసీడీఎస్ రూపశిల్పి కూడా ఆయనే.
దళిత సమా జ ఉన్నతికి ఆయన చూపిన చొరవ మరువలేనిది. దళిత, ఆదివాసీ బాల బాలికలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి, ఐఐటీలో ప్రవేశం కల్పించిన విద్యావేత్త, సామాజికవేత్త చుక్కా రామయ్యను ఈ సందర్భంగా ప్రస్తావించకుండా ఉండలేం. సామాజిక బాధ్యతతో దళితులు, పేదల పక్షాన నిలిచిన వ్యక్తులు చరిత్ర పొడవునా ఎందరో ఉన్నారు. వారి నిబద్ధతను, కార్యశీలతను దళితులే కాదు, సామాజిక సమానత్వానికి కట్టుబడిన వారెవరూ ఎన్నటికీ మరిచిపోరు. జూలై 20న దళిత శ్రేయోభిలాషులందరినీ మనస్ఫూర్తిగా అభినందిద్దాం.
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
మొబైల్: 97055 66213
- మల్లెపల్లి లక్ష్మయ్య