యాజమాన్యం వేధిస్తోందంటూ టీచర్ దీక్ష
అనంతపురం : గార్లదిన్నె మండలంలోని ఓ ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యం తన విషయంలో తీవ్ర ఇబ్బందులు పెడుతోందంటూ హిందీ పండిట్ బి.సోమశేఖర్ బాబు వాపోతున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేయించి న్యాయం జరిగేలా చూడాలని ఆయన గత పది రోజులుగా డీఈఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాడు. 1989 జనవరి 6న తాను సదరు స్కూల్లో టీచర్‌గా చేరానన్నాడు. 2005లో అనారోగ్యంతో సెలవు పెట్టానని.. తర్వాత వెళితే చేర్చుకోలేదన్నారు. చెప్పాపెట్టకుండా సెలవు పెట్టాడంటూ తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. తనను విధుల్లోకి తీసుకుని తర్వాత విచారించమని స్వయంగా విద్యాశాఖ ఆర్జేడీ, కమిషనర్, డీఈఓ నుంచి ఉత్తర్వులు వచ్చినా అమలు చేయలేదని ఆరోపించారు. ఈ క్రమంలో 2012లో తిరిగి తీసుకున్నా జీతాలు లేవన్నారు. ఇప్పటిదాకా తనకు మెమో ఇవ్వలేదన్నారు. సస్పెండ్ చేయలేదన్నారు.
2016 డిసెంబర్లో తన పోస్టులను ప్రభుత్వానికి సరెండర్ చేశారన్నారు. తనకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఎస్ఆర్ కూడా ఇవ్వడం లేదన్నారు. తాను వేరేచోటుకు పోస్టింగ్ చేయించుకునే ప్రయత్నం చేస్తుంటే అధికారులుపై ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అధికారులు కూడా పాఠశాల యాజమాన్యానికి మద్ధతు తెలుపుతున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. సదరు ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం వివరణ మరోలా ఉంది. టీచర్ సోమశేఖర్ బాబు చెప్పా పెట్టకుండా విధులకు సంవత్సరాల పాటు డుమ్మా కొట్టాడని, ఈ విషయం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లామంటున్నారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని భావించే ఆ పోస్టును ప్రభుత్వానికి సరెండర్ చేశామని చెబుతున్నారు.