‘హెలెన్’ బీభత్సం
=బందరు వద్ద తీరందాటిన తుపాను
=జిల్లాలో ఇద్దరు మృతి
=పలుచోట్ల నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
=విద్యుత్ సరఫరాకు అంతరాయం
=ఈదురుగాలులకు నేలవాలిన వరిచేలు
=24 గంటలపాటు వర్షాలు
=తీరందాటే సమయంలో తీవ్రత తగ్గటంతో ఊపిరిపీల్చుకున్న జిల్లావాసులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : గత మూడు రోజులుగా జిల్లాను వణికిస్తున్న హెలెన్ తుపాను శుక్రవారం మచిలీపట్నం వద్ద మధ్యాహ్నం 1.30 సమయంలో తీరం దాటింది. తుపాను ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి తుపాను తీవ్రత పెరిగింది. గంటకు 120 కిలోమీటర్ల వేగం కన్నా పైగా గాలులు వీయటంతో పాటు వర్షం కురిసింది. ఉదయం 11.30 గంటల సమయంలో నరసాపురం వైపు తుపాను తీరందాటే అవకాశముందని భావించినా.. ఆ తర్వాత దిశ మార్చుకుని మచిలీపట్నం వద్ద తీరం దాటింది. తుపాను తీరానికి చేరే సమయానికి తీవ్రత తగ్గటంతో ఉప్పునీరు గ్రామాల్లోకి చొచ్చుకురాలేదు. దీంతో అధికారులు, తీరప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇద్దరిని బలిగొన్న తుపాను...
తుపాను కారణంగా బలమైన గాలులు వీయటంతో కొబ్బరిచెట్టు విరిగిపడి కృత్తివెన్ను మండలం శీతనపల్లికి చెందిన గరికిముక్కు కాంతారావు (60), బందరు మండలం వైఎస్సార్‌నగర్‌లో విద్యుత్ స్తంభం విరిగి మీదపడి కారే జగన్నాథం (42) మృతిచెందారు. జగన్నాథం స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ.
మంత్రి రఘువీరా సందర్శన...
మచిలీపట్నం హిందూ కళాశాలలో ఏర్పాటుచేసిన పునరావాస శిబిరాన్ని కలెక్టర్ ఎం.రఘునందనరావుతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పరిశీలించారు. పునరావాస శిబిరాల్లో ఖర్చుకు వెనుకాడకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు.
భీతావహ వాతావరణం...
తుపాను తీరందాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మితిమీరిన వేగంతో వచ్చిన అలలకు గాలి, వర్షం తోడవటంతో సముద్రం సమీపంలో భయానక వాతావరణం నెలకొంది. సముద్రపు అలలు నాలుగు మీటర్ల కన్నా ఎత్తున లేచిపడ్డాయి. మంగినపూడి బీచ్‌లో 700 మీటర్ల మేర సముద్రపునీరు చొచ్చుకువచ్చింది. తుపాను తీరం దాటే సమయంలో తొలుత దక్షిణంవైపు నుంచి అనంతరం దిశ మారి తూర్పువైపు నుంచి బలమైన గాలులు వీచాయి.
ఎప్పటికప్పుడు కలెక్టర్ సమీక్ష...
తుపాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ ఎం.రఘునందనరావు సమీక్షించి అధికారులకు సూచనలు అందజేశారు. జాయింట్ కలెక్టర్ చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తుపాను మచిలీపట్నం వద్ద తీరం దాటినట్లు కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. తుపాను ప్రభావంతో 24 గంటలపాటు వర్షాలు కురుస్తాయన్నారు. ఆరు నుంచి ఏడు గంటలపాటు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. తుపాను ప్రభావిత మండలాల్లో 22 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో 5,358 మందికి పునరావాసం కల్పించినట్లు వివరించారు. వర్షం తగ్గిన తరువాత క్షేత్రస్థాయి పరిశీలన చేసి పంట నష్టం అంచనా వేస్తామన్నారు.
చిగురుటాకుల్లా వణికిన గ్రామాలు...
తుపాను ప్రభావంతో శుక్రవారం 11 గంటల వరకు వాతావరణం ప్రశాంతంగానే కనిపించినా ఆ తర్వాత ఒక్కసారిగా మార్పు కనిపించింది. దక్షిణ దిశ నుంచి వీచిన బలమైన గాలులతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. గాలులతో పాటే వర్షం ప్రారంభం కావటంతో సముద్రతీరంలోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి.
రైతుల ఆశలపై నీళ్లు...
హెలెన్ తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. కొద్దిరోజుల్లో ధాన్యం ఇంటికి చేరుతుందని ఆశిస్తున్న రైతులకు నిరాశ మిగిల్చింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. ప్రస్తుతం వరి పంట కోతకు సిద్ధమైంది. నాలుగు గంటల పాటు 120 కిలోమీటర్ల కన్నా వేగంతో గాలులు వీయటంతో అనేకచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. నేలవాలిన వరిపై వర్షం కురవటంతో ధాన్యం మొక్క మొలుస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖాధికారులు సూచించిన విధంగా 24 గంటల పాటు వర్షాలు కురిస్తే నేలవాలిన వరిపైకి వర్షపునీరు చేరి కంకులు మొలకెత్తే ప్రమాదముందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్ తదితరులు కృత్తివెన్నులో పర్యటించి నేలవాలిన వరిని పరిశీలించారు. పొలంలో ఉన్న నీటిని త్వరితగతిన బయటకు పంపాలని, ధాన్యం మొలకెత్తకుండా ఉప్పునీటి ద్రావణాన్ని కంకులపై పిచికారీ చేయాలని సూచించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం...
శుక్రవారం ఉదయం 11 గంటల సమయం నుంచి జిల్లా వ్యాప్తంగా బలమైన గాలులు వీచాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీగలు తెగిపడ్డాయి. దీంతో గంటలకొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖాధికారులు తెగిపోయిన విద్యుత్ వైర్లను సరిచేసే పనిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కొంత ఆలస్యమైనా విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.