hindu dharmika parishad
-
పదేళ్ల తర్వాత కొలువుదీరిన ధార్మిక పరిషత్
సాక్షి, అమరావతి: ఆలయాలు, మఠాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ధార్మిక పరిషత్ పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మరోసారి కొలువుదీరింది. తొలి ధార్మిక పరిషత్ 2009 నుంచి మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తర్వాతి ప్రభుత్వాలు పరిషత్ ఏర్పాటు చేయలేదు. మళ్లీ 21 మంది సభ్యులతో పరిషత్ ఏర్పాటు చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిషత్ సభ్యులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరిలో అధికారులతో కలపి 14 మంది సభ్యులు సచివాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చైర్మన్‌గా, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సభ్యులుగా, కమిషనర్ హరి జవహర్లాల్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. సభ్యులుగా తిరుమల పెద జీయంగార్ మఠాధిపతి, రిటైర్డు ఐఏఎస్ అధికారి అజేయ కల్లాం, దేవదాయ శాఖ రిటైర్డు అడిషనల్ కమిషనర్ ఎ.బి.కృష్ణారెడ్డి, రిటైర్డు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి కె.సూర్యారావు, దాతలు సంగా నరసింహారావు, యు.కె.విశ్వనాథరాజు, ఆగమ పండితులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, సీహెచ్ శ్రీరామ శర్మ, భీమవరానికి చెందిన దంతులూరి జగన్నాథరాజు చౌల్ట్రీ ఫౌండర్ ట్రస్టీ ఎం.రామకుమార్ రాజు, కడపకు చెందిన యదళ్ల పిచ్చియ్య చెట్టి చారిటీస్ అసోసియేషన్ ఫౌండర్ డా.జ్వాలా చైతన్య, పాలకొల్లుకు చెందిన చాకా వారి చౌల్ట్రీ ఫౌండర్ చాకా ప్రభాకరరావు ప్రమాణస్వీకారం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, వైఎస్సార్ జిల్లా పుష్పగిరి మఠాధిపతి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. హైకోర్టు రిటైర్డు జడ్జి మఠం వెంకట రమణ, చార్టెడ్ అకౌంటెంట్ శ్రీరామమూర్తితో పాటు ఇనుగంటి వెంకట రోహిత్, మాకా బాలాజీ, రాజన్ సుభాషిణి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరింత విస్తృతంగా హిందూ ధార్మిక కార్యక్రమాలు హిందూ ధార్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయాలనే అత్యున్నత లక్ష్యంతో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి, పరిషత్ చైర్మన్ కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఎంతో నిష్టాతులైన వారితో ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్ సూచనలను, సలహాలను అన్నింటినీ చిత్తశుద్ధితో అమలు చేస్తామని తెలిపారు. పరిషత్ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఆయన సభ్యులనుద్దేశించి మాట్లాడారు. «హిందూ మత ధర్మంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి దీని ఏర్పాటే నిదర్శనమన్నారు. భగవంతుని సహకారంతోనే ఎన్నో పథకాలను, కార్యక్రమాలను అమలు చేయగలుగుతున్నామని సీఎం జగన్ ఎప్పుడూ చెపుతుంటారని, భగవంతునిపై ఆయనకు ఉన్న భక్తికి ఇది కూడా ఒక నిదర్శనమని అన్నారు. ధార్మిక పరిషత్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నీ అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. హిందూ మత ప్రచారానికి పనిచేస్తున్న పీఠాలన్నీ సక్రమంగా సేవలందించాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినా ధార్మిక పరిషత్ ద్వారా వాటిని సరి చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పారు. -
ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం కోర్టు నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం ప్రభుత్వం 2015లో జారీచేసిన జీవోలోని క్లాజ్‌ను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ విజయవాడలోగల హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కామన్ గుడ్‌ఫంఢ్‌కు ఇచ్చే 9 శాతం నిధుల్లో 2 శాతాన్ని హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టుకు తప్పనిసరిగా కేటాయించాలనటం ఆంధ్రప్రదేశ్ ధార్మిక, హిందూ మతసంస్థలు, దేవదాయ చట్టం–1987లోని సెక్షన్ 70కి వ్యతిరేకమని సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు జారీచేసిన ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించిన జస్టిస్ ఇందూబెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరిల ధర్మాసనం స్టే ఇవ్వడానికి ఇటీవల నిరాకరించింది. 3 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కామన్ గుడ్‌ఫండ్‌కు నిధుల కేటాయింపును ఐదు నుంచి తొమ్మిది శాతానికి పెంచుతూ 2015 అక్టోబర్ 1న అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. జీవోలోని క్లాజ్ 7(2)(బీ) ప్రకారం హిందూ ధార్మిక కార్యక్రమాల నిమిత్తం తొమ్మిది శాతం నిధుల నుంచి రెండు శాతాన్ని తప్పనిసరిగా కేటాయించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని మూడునెలలకోసారి ప్రత్యేక ఖాతాలో సదరు ట్రస్టు వద్ద ఉంచాలని పేర్కొంది. 1987 చట్టం సెక్షన్ 70 ప్రకారం ఈ జీవో చట్టవిరుద్ధమని విశాఖపట్నానికి చెందిన ఒ.నరేశ్‌కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హిందు ధార్మిక పరిరక్షణ ట్రస్టు ఏ చట్టబద్ధమైన నిబంధనకు లోబడి ఏర్పాటుకాలేదని, సెక్షన్ 70లో పేర్కొన్న ప్రయోజనాల కోసం మాత్రమే ఆ మొత్తాన్ని మళ్లిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, హిందువుల ప్రయోజనాల కోసం ఆ విధంగా మళ్లించడం చట్టవిరుద్ధం కాదని, ఆలయాల తక్షణ మరమ్మతులు, పునర్నిర్మాణాలకు ఆ మొత్తాన్ని వినియోగిస్తారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. వాదనల అనంతరం నాటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సదరు ట్రస్టు చట్టబద్ధమైన సంస్థ కాదని గుర్తించింది. హిందూ ధార్మిక కార్యకలాపాలకు ఇచ్చే కామన్ గుడ్‌ఫండ్ 9 శాతం నిధుల్లో 2 శాతాన్ని తప్పనిసరిగా ఆ ట్రస్టుకు కేటాయించాలనటం చట్టవిరుద్ధమని పేర్కొంది. జీవోలోని క్లాజ్ 7(2)(బీ)ని కొట్టేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
సౌదీలో స్థలమిస్తారు.. ఇక్కడ విగ్రహాలు కూల్చేస్తారా
ఆరు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ సౌదీ అరేబియాకు వెళ్తే.. అక్కడ దేవాలయం కట్టుకోడానికి స్థలం ఇస్తామని ఆ దేశ పాలకులు చెప్పారని రమణానంద స్వామి చెప్పారు. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు నిరసనగా హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 800 సంవత్సరాల భారతదేశ చరిత్రలో విదేశీ పాలకులు చాలామంది మన దేవాలయాలను కూలగొట్టారని తెలిపారు. దేవుడి ఫొటో జేబులో పెట్టుకుంటే అరెస్టు చేసిన సందర్భాలున్నాయన్నారు. కానీ, ఇప్పుడు.. సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలకు స్థలం ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని రాత్రికి రాత్రే కూల్చేసి తీసుకెళ్లి మునిసిపాలిటీ ఆఫీసులో పారేస్తారా అని ఆయన నిలదీశారు. ఆయన మాట్లాడుతుంటే మధ్యలో మైకు మొరాయించడంతో.. ఇది కూడా ప్రభుత్వం చెప్పి చేయిస్తోందా అని ప్రశ్నించారు.