‘హిందుత్వ’ తీర్పుపై పునర్విచారణ
ప్రారంభించిన సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ: ఇరవై ఏళ్ల కిందట హిందుత్వంపై తాను ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు మంగళవారం పునర్విచారణ ప్రారంభించింది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని దుర్వినియోగం చేయడంపై ఆనాడు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సమీక్షిస్తోంది. ఈ విషయంలో అటార్నీ జనరల్‌ను భాగస్వామిని చేయాలన్న కొంతమంది కక్షిదారుల వినతిని ధర్మాసనం తిరస్కరించింది. చట్టానికి సంబంధించిన ప్రతీ కేసులో అటార్నీ జనరల్ సాయం అవసరమవుతుందని అనుకుంటున్నారా? అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది.
హిందూయిజం అనేది ఈ ఉపఖండంలో జీవించే ప్రజల జీవన విధానమని మనోహర్ జోషి వర్సెస్ ఎన్బీ పాటిల్ కేసులో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం 1995లో తీర్పునిచ్చింది. అయితే ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టంలో 123 సెక్షన్‌లోని సబ్ సెక్షన్ (3) ప్రకారం అవినీతి లేదా తప్పుడు విధానం కిందకి వస్తుందా అన్న ప్రశ్న తలెత్తింది. అయితే ఈ విషయం 2014 జనవరి 30న మళ్లీ ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం ధర్మాసనం ముందుకు రావడంతో దీన్ని ఏడుగురు సభ్యుల బెంచ్‌కు సిఫారసు చేసింది. ఇప్పుడు ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఈ తీర్పుపై పునర్వివిచారణ చేపట్టింది.