పాక్‌లోని హిందువులకు కొత్త ఏడాది కానుక
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని హిందువులకు నూతన సంవత్సరంలో కొత్త బహుమతి అందినట్లయింది. అక్కడి హిందువులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిందూ వివాహాల చట్టానికి సంబంధించిన బిల్లును మానవ హక్కుల వ్యవహారాలు చూసుకునే సెనేట్ క్రియాశీల కమిటీ ఏకగ్రీంగా సోమవారం ఆమోదించింది. హిందూ వివాహాల బిల్లు-2016కు సెప్టెంబర్ నెలలో జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం, దీనిని సెనేట్ కమిటీకి పంపించగా అది తాజాగా ఆమోదించింది.
ఈ బిల్లు చట్టంగా రూపొందితే ప్రతి హిందువు వివాహాన్ని నమోదు చేసుకునే వీలుంటుంది. అలాగే, పాక్‌లోని హిందువులు తమ వివాహ సమస్యలపైనా, అలాగే విడాకుల సమయంలో కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ బిల్లుకు తాజా ఆమోదం లభించిన నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీలోని మైనారిటీ విభాగం సభ్యుడు రమేశ్ కుమార్ వాంక్వాని స్పందిస్తూ ఇది పాక్‌లోని హిందువులకు న్యూఇయర్ కానుక అని అభివర్ణించారు.