Hindu Rashtra
-
'చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించండి'
ఢిల్లీ:ఆల్ ఇండియా హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాని మహారాజ్ మరోసారి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రుడ్ని హిందూ దేశంగా ప్రకటించాలని కోరారు. ఇతర మతాలు, దేశాలు ప్రకటన చేయకముందే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటును శివ శక్తిగా నామకరణం చేయడంపై ప్రధాని మోదీకి చక్రపాని మహారాజ్ ధన్యవాదాలు తెలిపారు. చంద్రునిపై హిందూ దేశం స్థాపించిన తర్వాత శివ శక్తి పాయింట్‌ను రాజధానిగా మార్చాలని కోరారు. 'చంద్రున్ని హిందూ సనాతన దేశంగా పార్లమెంట్లో ప్రకటించాలి. చంద్రయాన్ 3 జాబిల్లిని తాకిన చోటును రాజధానిగా నిర్మించాలి. అప్పుడు జిహాదీ స్వభావం ఉన్న ఉగ్రవాదులు అక్కడకు రాకుండా ఉంటారు.' అని స్వామి చక్రపాని మహారాజ్ అన్నారు. గతంలోనూ ఇలాంటి వివాదాంశాల్లో స్వామి చక్రపాని మహారాజ్ చిక్కుకున్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు గోమాంసం తినేవారికి ఎలాంటి సహాయం అందకూడదని అన్నారు. కాగా.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని చేరడంతో చంద్రయాన్ 3 విజయం సాధించింది. దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్ చంద్రున్ని తాకిన చోటుని ప్రధాని మోదీ శివ శక్తి పాయింట్‌గా పేరు పెట్టారు. ఇదీ చదవండి: చంద్రుడిపై ఉష్ణోగ్రతల్లో వేగంగా మార్పులు -
'హిందూ రాజ్యం'పై సీఎం యోగి వ్యాఖ్యలు!
లక్నో: భారతదేశాన్ని 'హిందూ రాజ్యం'గా మార్చాలన్న భావనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మద్దతు పలికారు. ప్రజలకు, దేశానికి మేలు చేసేదిగా ఉన్నట్టయితే.. ఈ భావనలో ఎలాంటి తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. హిందూత్వ అతివాద సంస్థగా ముద్రపడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చాలని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, 120 కోట్ల జనాభా, విభిన్న మతవిశ్వాసాలతో లౌకిక దేశంగా ఉన్న భారత్‌లో ఈ అంశం వివాదాన్ని రాజేసే అవకాశముంది. 'హిందూ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలన్న భావన తప్పేమీ కాదు. హిందూత్వమనేది మతం కాదు, ఉపాసన విధి కాదు, ఇది జీవన విధానం మాత్రమేనని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పేర్కొంది' అని సీఎం యోగి ఆదిత్యనాథ్ దూరదర్శన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. 'హిందూ దేశం' ప్రజలకు మంచి జీవితాన్ని, ఆనందాన్ని ప్రసాదించేందుకు దోహదపడితే.. దానిని ఒప్పుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల విషయంలో బీజేపీ సీఎం యోగికి మద్దతుగా నిలిచింది. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది. -
'ఇండియాను హిందూ దేశంగా ప్రకటించండి'
ముంబయి: భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆదివారం ముంబయిలో ఓ సమావేశంలో మాట్లాడుతూ అంతకంటే ప్రత్యామ్నాయం లేదని అన్నారు. 'భారత్ ను హిందూ రాష్ట్రం(దేశంగా) ప్రకటించడం తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. చాలా కాలంగా భారతీయులంతా లౌకికవాదం అని చెబుతూ వస్తున్నారు. దానివల్ల ఇక్కడి హిందువులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అది(లౌకికత్వం) చాలు ఆపేయండి' అని ఠాక్రే చెప్పారు. కశ్మీర్ అల్లర్లను ఆపేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఇబ్బందులు పడుతున్న బాధలను గుర్తించలేదని ఆరోపించారు. 'కశ్మీర్ అల్లర్లకు ఎవరు కారణం? అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. హిందువులను కొడుతున్నారు. జవాన్లపై దాడులు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక అంతా మారుతుందని ప్రతి ఒక్కరు ఆశించారు' అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు.