'హిందూ రాజ్యం'పై సీఎం యోగి వ్యాఖ్యలు!
లక్నో: భారతదేశాన్ని 'హిందూ రాజ్యం'గా మార్చాలన్న భావనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మద్దతు పలికారు. ప్రజలకు, దేశానికి మేలు చేసేదిగా ఉన్నట్టయితే.. ఈ భావనలో ఎలాంటి తప్పు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
హిందూత్వ అతివాద సంస్థగా ముద్రపడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భారత్‌ను హిందూ రాజ్యంగా మార్చాలని కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే, 120 కోట్ల జనాభా, విభిన్న మతవిశ్వాసాలతో లౌకిక దేశంగా ఉన్న భారత్‌లో ఈ అంశం వివాదాన్ని రాజేసే అవకాశముంది.
'హిందూ రాజ్యాన్ని ఏర్పాటుచేయాలన్న భావన తప్పేమీ కాదు. హిందూత్వమనేది మతం కాదు, ఉపాసన విధి కాదు, ఇది జీవన విధానం మాత్రమేనని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ పేర్కొంది' అని సీఎం యోగి ఆదిత్యనాథ్ దూరదర్శన్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. 'హిందూ దేశం' ప్రజలకు మంచి జీవితాన్ని, ఆనందాన్ని ప్రసాదించేందుకు దోహదపడితే.. దానిని ఒప్పుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యల విషయంలో బీజేపీ సీఎం యోగికి మద్దతుగా నిలిచింది. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని పేర్కొంది.